ఆర్టీసీ బస్సుల్లో అధికారుల తనిఖీలు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 12:25 PM GMT
ఆర్టీసీ బస్సుల్లో అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు ఆర్టీసీ బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం నడుపుతున్న బస్సుల్లో కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ రావు ఆదేశాల మేరకు రాజేంద్రనగర్‌లోని డైరీ ఫామ్‌, శివరామ్‌పల్లి, ఆరంఘర్‌ ప్రాంతాల్లో నడుస్తున్న బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. సీనియర్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ సురేందర్‌రెడ్డి బృందం.. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకుంది. కండక్టర్లు టికెట్‌ చార్జీలు ఎంత తీసుకుంటున్నారని ప్రయాణికులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ నిర్ణయించిన చార్జీలు మాత్రమే కండక్టర్‌కు ఇవ్వాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు. అలాగే అన్ని బస్సుల్లో పాస్‌లు చెల్లుతాయని.. ఒక వేళ కండక్టర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అయితే సాయంత్రం వచ్చేసరికి 8 వేల రూపాయాలు కట్టాలని రాజేంద్రనగర్‌ డిపో మేనేజర్‌.. తమను ఒత్తిడికి గురిచేస్తున్నారని బస్సులు నడుపుతున్న ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లు వాపోయారు. 8 వేల రూపాయాలను కట్టని పక్షంలో మాకు రావాల్సిన జీతాలను ఇవ్వమని డిపో మేనేజర్‌ బెదిరిస్తున్నారని.. అధికారులకు కండక్టర్లు, డ్రైవర్లు ఫిర్యాదు చేశారు.

Next Story