అమెరికా సాక్షిగా పాక్ ను హెచ్చరించిన ప్రధాని మోడి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 5:52 AM GMT
అమెరికా సాక్షిగా పాక్ ను హెచ్చరించిన ప్రధాని మోడి

ఆదివారం అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో 'హౌడీ మోడి' కార్యక్రమంలో భారత్ ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలిసి ఒక వేదిక ను పంచుకున్నారు. కార్యక్రమంలో భారీగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. అందరినీ ఉద్దేశించి మోడీ తెలుగుతో సహా పలు భారతీయ భాషల్లో ‘అందరూ బాగున్నారా’ అంటూ పలకరించారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ జీవన విధానం, అలాంటి సంస్కృతి కి ప్రవాస భారతీయులంతా ప్రతినిధులు అని అన్నారు. తనకు ఘన స్వాగతం పలికిన హ్యుస్టన్ వాసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ చిరపరిచితులనీ, మరో సారి ట్రంప్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానీ మోడి అన్నారు.

70 వేల మందికి పైగా ప్రవాస భారతీయులతో ఎన్‌ఆర్‌జీ స్టేడియం కిక్కిరిసిపోయింది. మోదీ, మోదీ, భారత్ మాతా కీ జై, వందే మాతరం వంటి నినాదాలతో ప్రవాస భారతీయులు హోరెత్తించారు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు, మేయర్లు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

పాకిస్తాన్ పై ప్రధాని చురకలు వేసారు. పాకిస్తాన్ పేరు గానీ, ఇమ్రాన్ ఖాన్ పేరు ఎత్తకుండా అందరికీ అర్ధం అయ్యేటట్లు మాట్లాడారు. తమ దేశాన్ని సరిగ్గా కాపాడుకోలేని పొరుగువాళ్లు తమపై నిత్యం విషాన్ని కక్కుతున్నారని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ఏ మాత్రం భరించలేకపోతోందని మండిపడ్డారు.

స్వదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో, భారత్-అమెరికా మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచడంలో ప్రవాస భారతీయులు చేస్తోన్న కృషి గొప్పదని ప్రధాని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేస్తోన్న ఘనత కూడా ప్రవాస భారతీయులదేనని చెప్పారు. స్వదేశంలో తాము సాధించిన విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని, తాము పుట్టిన గడ్డ ఎంత గొప్పదో.. తమ నైపుణ్యం ద్వారా చాటుతున్నారని కితాబిచ్చారు.

ఆ తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. భారత్ - అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలోపేతం అయ్యాయనీ, ఇరుదేశాల ప్రజాస్వామ్యాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయనీ ఆయన అన్నారు. సరిహద్దు భద్రత అంశంలో భారత్ కు సహకరిస్తామని కూడా ఆయన చెప్పారు.

Next Story