జొమాటో చేతికి ఉబర్ ఈట్స్.. మరి వారి పరిస్థితి ఏంటి.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jan 2020 10:40 AM GMTజొమాటో.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో దిగ్గజం. ఈ సంస్థ మరో ఫుడ్ డెలివరీ సంస్థను కొనుగోలు చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ అయిన ఉబర్‌కు చెందిన పుడ్ డెలివరి సంస్థ ఉబర్ ఈట్స్ ను కొనుగోలు చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన చేసింది. జొమాటో ఆల్ స్టాక్ ఒప్పందంలో భాగంగా ఈ కొనుగోలు చేసింది. ఇకనుండి ఉబర్ ఈట్స్ తన కార్యకలాపాలను నిలిపివేసి.. జొమాటోతో జత కానుంది. ఉబెర్ ఈట్స్‌ను జోమాటో కొనుగోలు చేస్తున్నట్లు గతంలో అనేక వార్తలు షికారు చేశాయి
భారత కరెన్సీ ప్రకారం రూ. 2,485 కోట్లు( 350 మిలియన్ డాలర్లు) డీల్ కుదుర్చుకొని ఉబెర్ ఈట్స్‌ను జొమాటో తన వశం చేసుకుంది. ఈ ఒప్పందం తక్షణమే అమలులోకి తీసుకువస్తునట్లు సమాచారం. ఇదిలావుంటే.. ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న వారి భవిష్యత్తు ఏంటనే విషయమై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
ఈ సందర్బంగా.. జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.. ఉబెర్ ఈట్స్ ఇండియా ఇప్పుడు జొమాటోగా మారిందని.. ఇదో కొత్త ప్రయాణమని.. ఇక నుండి వినియోగదారులకు రుచికరమైన ఆహారాన్ని అందజేస్తాం అని ట్వీట్ చేశారు. జొమాటో దేశంలోని 500నగరాలకు పైగా సేవలను అందిస్తోందని తెలిపారు.
ఇదిలావుంటే.. ఉబెర్ ఈట్స్‌ను 2017లో ప్రారంభించారు. అప్పటికే ఆన్‌లైన్ పుడ్ డెలివరీ రంగంలో రాణిస్తున్న జొమాటో, స్విగ్గీ వంటి వాటితో పోటీపడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. అయినా ఉబర్ ఈట్స్ ఆశించిన స్థాయిలో మార్కెట్‌ను నిలబెట్టుకోలేకపోయింది. అయితే.. ఉబెర్ ఈట్స్ గడిచిన రెండేళ్లలో భారీ మొత్తాన్ని ఆర్జించిందని సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి అన్నారు. ఇండియాలో ఉబెర్‌కు మంచి మార్కెట్ ఉందని.. ఇకపై తమ రైడింగ్ బిజినెస్‌ను పెంచుతామని ఆయన తెలిపారు.