రాశి ఫలాలు: అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 19 వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 7:44 AM GMT
రాశి ఫలాలు: అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 19 వరకు

మేష రాశి:

ఈ రాశి వారికి వారంలో మనోధైర్యం పెరుగుతుంది. రెండు రోజులు ప్రతికూలంగా ఉన్నా మిగిలిన ఐదు రోజులు మానసికంగా, ఆర్థికంగా బావుంటుంది. గత వారం కన్నా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. సప్తమంలో కుజ శుక్రులు, లగ్నంలో చంద్రుడు పరస్పర వీక్షణ వల్ల కొద్దిపాటి ప్రయత్నంతోనే మానసిక ఆనందమూ, పనిలో తృప్తిని పొందుతారు. తండ్రి ,గురువులకు కోపం రాకుండా చూసుకోవడం అవసరం . వారి అనుగ్రహం తోడైతే మీకు ఎదురులేదు. స్నేహితులను కలుపుకుంటూ పోవడం మంచిది. 18, 19 తేదీల్లో చిన్న ఆందోళన పడతారు.

పరిహారం :

చంద్రశేఖర అష్టకం , శివతాండవ స్తోత్రం చదివినా, విన్నా మంచి ఫలితాలు పొందుతారు దక్షిణామూర్తి స్తోత్రం జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

వృషభ రాశి:

ఈ రాశి వారికి పన్నెండో ఇంట చంద్రుడు, సప్తమస్థానంలో బుధ,శుక్రు లు ఉండడం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేక పోతారు. అయినా గురుని దృష్టి ఉండటం వల్ల వారాంతంలో శుభ ఫలితాలు పొందుతారు. మనస్సు నిలకడగా ఉంచి ధైర్యంగా ముందుకు వెళ్లటం అవసరం. గురువు యొక్క సలహాను పాటించడం మంచిది. ధర్మపత్ని సహకారంతో కూడిన సలహా మేలు చేస్తుంది. పదిహేడో తేదీన మంచి మాట వినే అవకాశం ఉంటుంది. బుధ, గురువారాల్లో రోహిణి, మృగశిర నక్షత్రాల వారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి బాగుంది. ఈ రాశివారికి దైవ బలము, గురు బలమే ఎక్కువ. అదే ఈ వారం ముందుకి నడిపిస్తుంది.

పరిహారం:

ఈ రాశి వారు ప్రతి రోజు ఆలయానికి వెళ్ళడం ద్వారా గురు దృష్టి పొందగలరు. పదిహేడవ తేది సంకష్టహర చతుర్థి కావున ఆ రోజున గణపతిని గరికతో అర్చన చేయటం, గణేశ పంచరత్న స్తోత్రం చదవటం మంచిది.

మిధున రాశి:

ఈ రాశి వారికి లాభం చంద్రుడు కాబట్టి కొంత బావుంటుంది. అనారోగ్యం ఉన్నప్పటికీ ఆందోళన తగ్గుతుంది. మీమాటే జరగాలనే మొండి పట్టుదల వీడండి. వాహనంపై ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ఈ వారం మీకు గురుబలం తక్కువ కాబట్టి చేయాల్సిన పనులను మరిచిపోతూ ఉంటారు. శని దృష్టి వలన ఫలితాలు సరియైనవి రాకపోవచ్చు. భార్యాభర్తల ఎడబాటుకు లేదా కోపతాపాలకు, పట్టుదలలకు అవకాశాలెక్కువ. మృగశిర, ఆర్ద్ర నక్షత్రాల వారికి శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఈ రాశివారికి ఈ వారం ఆర్థికంగా కొంత యోగ్యమైనది అని చెప్పొచ్చు .

పరిహారం:

ప్రతిరోజూ శివుని దర్శనం మంచిది. దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం చదవండి. వీలైతే శని దర్శనం చేసుకోండి. దంపతులిద్దరూ సుబ్రహ్మణ్య అష్టకం చదవడం మంచిది.

కర్కాటకరాశి :

ఈ రాశి వారికి ఈ వారం ధైర్యసాహసాలు మెండుగా ఉంటాయి. శత్రువులు అపజయము, మీ జయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గతంలో పొందిన శుభ ఫలితాలు మీకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి అనుకూలత ఉంది. చతుర్థ పంచమ స్థానాల్లో ఉన్న బుధ, శుక్ర, గురులు మీ ప్రమేయం లేకుండానే అవతలి వాళ్లు ఒక అడుగు వెనుకంజ వేసేలా చేస్తారు. దానికి ఆశ్చర్య పడాల్సిన పని లేదు. పునర్వసు వారికన్నా పుష్యమి ఆశ్లేష వారు ఎక్కువ శుభ ఫలితాలు పొందుతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి. అనుకూలమైన తీర్పులు పొందే వీలు ఉంది.

పరిహారం :

జాతకంలో పంచమ గురుని బలం వృద్ధి కోసం దైవారాధన సత్ఫలితాలు ఇస్తుంది. మనోబలం కోసం చంద్రుని శ్లోకం పఠించడం మంచిది.

సింహరాశి:

ఈ రాశివారికి సహజంగానే మాట కాఠిన్యత ఉంటుంది. రవి, కుజుల ప్రభావం ఇంకా పెరుగుతోంది కనుక కంటి చూపు జాగ్రత్త అవసరం. ఆచి తూచి మాట్లాడటం, అవసరమైనంత వరకే మాట్లాడటం మంచిది. శని,కేతు సంబంధము నిద్ర, బద్ధకాలను పెంచుతాయి. 4వ ఇంట గురుడు తల్లి తరపువారి ప్రేమను పెంచుతాడు. భాగ్యచంద్రుడు మనశ్శాంతిని ఇస్తాడు. ఆర్థిక వనరులు సమకూర్చుకునే ప్రయత్నం ఉంటుంది. 15,16 తేదీలలో రాహువు, చంద్రుల ప్రభావంతో స్థిర చర ఆస్తులు సమకూరుతాయి. మంచి రిలాక్సేషన్ అనగా విశ్రాంతిని మానసిక శాంతిని పొందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి.

పరిహారం :

విష్ణు సహస్రనామ పారాయణ, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం ఆరోగ్య వృద్ధిని కలిగిస్తాయి.

కన్యారాశి:

ఈ రాశివారికి చతుర్ధ సప్తమాధిపతి గురుని వలన అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల సహాయ సహకారాలు అందుతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు. కాని.. మానసికంగా మిమ్మల్ని నిరుత్సాహ పరిచే వాళ్లు మీ వెంటే ఉంటారు. ధనాధిపతి శుక్రుని వలన ఏదో ఒక రూపంలో డబ్బు మీ చేతికి అందుతుంది అయినా ..అంతకంతా ఖర్చే అవుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం అనారోగ్యాన్ని సూచన. కేతువు వల్ల పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం. అష్టమ చంద్రుడు మీ నిర్ణయాలను వెనక్కి లాగినా భాగ్య చంద్రుడు పని జరిపించుకునే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తాడు. ఉత్తర, హస్త నక్షత్ర జాతకులు ఏదన్నా శుభవార్త వినే అవకాశం ఉంది.

పరిహారం:

అశ్వత్థ ( రావి చెట్టు) ప్రదక్షిణ ఏడుసార్లు చేయడం మంచిది.. సోమవారం శివునికి అభిషేకం, శనివారం రాముని పూజ మంచి ఫలితాలను ఇస్తాయి.

తుల రాశి:

ఈ రాశివారికి ధన స్థానంలో గురుని వలన మంచికి మారుపేరు అనిపించుకుంటారు. మానసిక ధైర్యం తగ్గినప్పుడు లగ్నంలో ఉన్న బుధ, శుక్రుల వల్ల కొత్త వ్యక్తులు కొత్త వస్తువులు సమకూరి స్థైర్యం ఇస్తాయి. 12 వ ఇంట రవి కుజులు పనులలో ఆటంకాన్ని సూచిస్తున్నాయి. మొండి ధైర్యం వద్దు ఆలోచించి అందరినీ మెప్పించి, ఒప్పించి ముందడు గు వేయటం మంచిది. చిత్తా నక్షత్రం వారికి షష్ఠ చంద్రుడు అయినా క్షేమాన్ని కలిగిస్తాడు. స్వాతీ నక్షత్రం వారికి పద్నాలుగు పద్దెనిమిది తేదీలు మంచిని సూచిస్తున్నాయి. విశాఖ వారు పదిహేనో తేదీ జాగ్రత్త వహించండి.

పరిహారం:

పరిహారం 15,16,17 తేదీలలో *దధిశంఖ తుషారాభం* అనే చంద్రుని శ్లోకం పఠించండి మంత్రపుష్పం శ్రద్ధగా వినండి. కాళిదాసు రాసిన దశశ్లోకీ అనే స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి. మంచి మార్పు ను మీరే గుర్తిస్తారు.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారికి ఈ నెల కొంచెం లాభదాయకమని చెప్పొచ్చు. వ్యయమందు బుధ, శుక్రుడు ఉన్నప్పటికీ ద్వితీయ అధిపతి గురుడు లగ్నంలో ఉండటం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వారికి లాభ స్థానంలో రవి రాజ యోగ కారకుడు. అందుకే దోష పరిహారం జరుగుతూ ఉంటుంది. ఎంత లాభం చేకూరుతుందో అంత ఆందోళన ఉంటుంది. ఏల్నాటి శని విడిచే సమయం కాబట్టి ఇంకో నెల రోజులు తీవ్ర ఆందోళన తప్పదు. పద్దెనిమిదవ తేదీన రవి తులలో కొస్తాడు. అంటే వ్యయంలోని రవి, బుధ శుక్రులు కలయికలో కూడా శారీరక అనారోగ్యం కనిపిస్తుంది. జ్యేష్ఠా నక్షత్రం వారు 18 వ తేదీన ప్రయాణం పెట్టుకోకుండా ఉండటం మంచిది. విశాఖ, జ్యేష్ఠల వారికి మంచి ఫలితాలు కనిపిస్తే అనురాధ వారికి మిశ్రమ ఫలితం.

పరిహారం:

శని స్థితి బాగాలేదు కనుక శనిస్తోత్రం తైలాభిషేకం చేయటం, నువ్వుల దానం చేయడం మంచిది. గురుడుకి కూడా దక్షిణామూర్తి స్తోత్రము మంచి చేస్తుంది.

ధను రాశి:

ఈ రాశివారికి లగ్నాధిపతి గురుడు వ్యయ మందుండటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. లగ్నంలో శని కేతు ప్రభావం శరీరము, మనస్సులను దెబ్బతీస్తుంది. లాభంలో బుధ, శుక్ర ప్రభావము కొంత ఊరటనిస్తుంది. రాజ్యంలో ఉన్న రవి కుజుల ప్రభావము వలన స్థిరాస్తి అమ్మినా లాభం తక్కువ, మోసపోయిందే ఎక్కువ. సహకరించాల్సిన మిత్రులు కూడా అందుబాటులో ఉండరు. ఏల్నాటి శని తను స్థానంలో ఉండడం వల్ల శారీరక అరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గ్రహ స్థితుల వల్ల మీరు ఇతరులను ఎవరినీ నమ్మలేరు. సంతానంపై శుభ దృష్టి ఉంది కావున తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు అందరూ కలిసి మెలిసి ఉండే అవకాశం ఎక్కువ. కోర్టు వ్యవహారాలలో ఉపశమనం ఉంటుందని చెప్పలేం. మూలానక్షత్రం జాతకులకు అనారోగ్య స్థితి. పూర్వాషాడ వారికి మధ్యమం.

పరిహారం:

అతిథి, అభ్యాగతులను ఆదరించండి. శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం మంచిది.

మకర రాశి:

ఈ రాశి వారికి రాజ్య స్థానంలో బుధ శుక్రులు, లాభ స్థానంలో గురుడు ఉండటం వల్ల చేస్తున్న పని తృప్తినిస్తుంది. ఆదాయం కూడా బాగుంటుంది. లగ్నాధిపతి శని స్థితి అనారోగ్య సూచన. రవి కుజుల కలయిక బంధు వర్గాలతో విభేదాలు సూచిస్తున్నాయి. తృతీయాధిపతి గురుడు లాభస్థితి కావున సోదరులతో సఖ్యతను పెంచుతుంది. వాక్చాతుర్యం ఉన్నా ప్రస్తుతం మీ మాట చెల్లుబాటు కాదు. ఇతరులు మీ మాటల్లో విభేదించి లాభం పొందుతారు. చంద్రుని అనుకూలత మనశ్శాంతి నిస్తుంది. భోజనము, నీరు అందుబాటులో ఉన్నా తీసుకోవాలి అని ఉండదు. దీర్ఘ వ్యాధులున్న వారు ఔషధ సేవ చేసి కొంత ఆరోగ్యాన్ని పొందుతారు. ఉత్తరాషాఢ వారికి అందరూ మంచివారే. శ్రవణం వారు తన తల్లిదండ్రులు తరపు వారి వల్ల ఆనందం పొందుతారు. ధనిష్ఠ వారు 15,16 తేదీల్లో ఆరోగ్యం పట్ల, వాహనాల పట్ల జాగ్రత్త వహించండి. డబ్బు ఖర్చు ఎక్కువ.

పరిహారం :

మంగళవారం సుబ్రహ్మణ్య, ఆంజనేయ, అమ్మవారి పూజలు వారమంతా శుభ ఫలితాలని ఇస్తాయి. వీలయితే ఖడ్గమాల పారాయణ లేదా వినడం మంచిది. హనుమన్మాలా మంత్రం పారాయణ చేయండి.

కుంభ రాశి:

ఈ రాశి వారిలో ఎక్కువ మందికి శుభఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ, ఆర్థిక లాభం ఉంది. ఆరోగ్యం మెరుగౌతుంది. తల్లిదండ్రులకు మీ యందు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. నిజాయితీ నిరూపించుకునే అవకాశం ఉంది. ధనాధిపతి రాజ్యంలో ఉండడం, చంద్రుడు గురుని ఇంట్లో ఉండడం ఇవన్నీ ఈ వారం అంతా మంచిని సూచిస్తున్నాయి. మీ మాటకు విలువ ఉంటుంది. పెద్దవారితో పరిచయాలు పెరిగుతాయి. స్త్రీ పురుషులు మానసికంగా దగ్గరవుతారు. అష్టమంలో రవి కుజుల కలయిక చిన్న పిల్లలు, గర్భిణుల ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. ఇన్నాళ్లు ఆగిన పనులు మీరు ప్రయత్నిస్తే చాలు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారంలోనూ, పెళ్లి విషయంలోనూ మాత్రం అనుకూలత తక్కువగా ఉంది. ధనిష్ట వారు 15,16 తేదీల్లోనూ శతభిషం వారు 16,17 తేదీల్లోనూ వాహనాలకు దూరంగా ఉండండి. సాహసకృత్యాలు చేయవద్దు. మొత్తం మీద 75 శాతం పనులు నెరవేరుతాయి.

పరిహారం :

దైవధ్యానం మీ పనులను మరింత త్వరగా జరిగేటట్లు చేస్తాయి. ధనిష్ఠ, శతభిషం నక్షత్రాల వారు హనుమాన్ చాలీసా రోజూ ఏడు సార్లు పారాయణ చేయండి. కందులు ఉడికించి బెల్లంతో కలిపి తింటే మంచిది .

మీన రాశి:

ఈ రాశి పై రవి కుజుల సప్తమ దృష్టి, అష్టమంలో బుధ,శుక్రులు అనారోగ్య కారకాలు. మీ మాటలే మిమ్మల్ని బాధించి బంధువులు మిత్రులు దూరం అవటానికి కారణం అవుతాయి. చెడ్డవారు మీ చుట్టూ చేరతారు. వారివల్ల మీ విలువ కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా ఏటికి ఎదురీతలా కష్టం అవుతుంది. మనో ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వహించండి. వృత్తిపై, చేస్తున్న పనిపై శ్రద్ధ ఎక్కువగా చూపండి. స్థిరాస్తులపై ఇతరుల దృష్టి, నరఘోష చాల ఎక్కువ. లాభ వ్యయాధిపతి శని పదవ ఇంట్లో ఉన్నా ఆర్థిక మాంద్యం ఎక్కువ. చేతికి అందాల్సిన మీ సొంత సొమ్ము కూడా అందదు. అప్పుల వాళ్లు మీపై ఒత్తిడి తెస్తారు. విలువైన వస్తువులు కొన్నాళ్లపాటు కనిపించవు. అధికారులు, అన్నావదినలు, పెద్దవాళ్లతో జాగ్రత్త. స్త్రీలతో వాదనలకు దిగకండి. వారికి వీలైనంత దూరంగా ఉండండి.

పరిహారం :

ఉపదేశం పొందిన మంత్రాలను అనుష్ఠానం చేయండి. రోజూ ఒక అర్ధగంట తక్కువ లేకుండా ఏకాంతంగా మనస్సులో మౌనం వహించండి. మంగళవార నియమాలు పాటించండి.

Next Story
Share it