వల్లభనేని వంశీ రాజీనామా వెనుక వైసీపీ వ్యూహం ఇదేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 7:12 AM GMT
వల్లభనేని వంశీ రాజీనామా వెనుక వైసీపీ వ్యూహం ఇదేనా..?

అమరావతి : అందరూ ఊహించినట్లుగానే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ లేఖపై చంద్రబాబు స్పందించి లేఖ రాశారు. ఈ లేఖపై కూడా వంశీ స్పందించి మరో లేఖ రాశారు. కొత్త ట్విస్ట్‌కు తెరతీశారు. ఈ మధ్యాహ్నం గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు సీఎం జగన్‌తో భేటీ కానున్నారు.

ఈ తరుణంలో టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా వెంకట్రావు కంటే ఓ అడుగు ముందుకు వేశానని వంశీ సంకేతాలిచ్చారు. మొత్తంగా గన్నవరం రాజకీయాలన్ని కాకపుట్టిస్తున్నాయి. జిల్లా మంత్రులను వెంటపెట్టుకుని వంశీ, జగన్‌ను కలిశారు. ఆర్థికంగా రాజకీయంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ ముందు ఏకరవు పెట్టారు. వైసీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. అన్నీ విన్న జగన్ ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఈ పరిణామంతో వెంకట్రావు అనుచరులు హడావిడి చేశారు. వంశీని చేర్చుకోవద్దంటూ ఆందోళన కూడా చేశారు. అయితే జగన్‌ను కలవబోతున్నానని, ఆయన తగిన న్యాయం చేస్తారని అనుచరులను సముదాయించారు.

శాసనసభలో ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే వారిని సస్పెండ్ చేయాల్సిందిగా అసెంబ్లీ వేదికగా స్పీకర్‌కు జగన్ సూచించారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు కాకుండా చంద్రబాబుకు వంశీ పంపారు. ఈ లేఖను చంద్రబాబు స్పీకర్‌కు పంపడం, ఆ తర్వాత ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగితే.. గన్నవరం ఉప ఎన్నికలను టీడీపీ కోరి తెచ్చుకుందని బయటకు చెప్పవచ్చని వైసీపీ వ్యూహంగా ఉంది. ఒకవేళ ఆ లేఖను స్పీకర్‌కు పంపని పక్షంలో శాసనసభ సభ్యత్వానికి వంశీ రాజీనామా చేసినా.. ఆయన రాజీనామా లేఖను చంద్రబాబు తన దగ్గరే పెట్టుకున్నారంటూ చెప్పే అవకాశం దొరుకుతుందని వైసీపీ వ్యూహకర్తల భావన. ఇదే సమయంలో వంశీ కూడా జాగ్రత్త పడ్డారు. టీడీపీకి రాజీనామా చేసి శాసనసభ సభ్యునిగా వైసీపీలో చేరితే ఫిరాయింపుల చట్టం కింద వస్తుంది. అలా కాకుండా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరకుండా ఉంటే తటస్థ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంటుంది. దీనివల్ల నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పడంతోపాటు వైసీపీ నుంచి కూడా సానుభూతి వస్తుందని వంశీ వర్గీయులు భావిస్తున్నారు. ఇప్పుడు వంశీ విషయంలో వైసీపీ ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

Next Story