ఏపీ రైతులకు జగన్‌ గుడ్‌న్యూస్‌.. నేడు ఖాతాల్లో డబ్బులు జమ

By సుభాష్  Published on  15 May 2020 2:45 AM GMT
ఏపీ రైతులకు జగన్‌ గుడ్‌న్యూస్‌.. నేడు ఖాతాల్లో డబ్బులు జమ

ఏపీలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్‌.. పాలన పరంగా దూసుకెళ్తున్నారు. ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. తాజాగా శుక్రవారం 'వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌' పథకం ద్వారా రైతుల ఖాతాలకు నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.

రైతుల ఖాతాల్లో రూ.2,800 కోట్లు

ఇక పంట వేసేందుకు సిద్ధమవుతున్న రైతులకు ఈ పథకం ద్వారా జగన్‌ తీపి కబురు అందించనున్నారు. రైతు భరోసా పథకం కింద నిధులను ఈ రోజు నుంచి లబ్ధిదారులను అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49,43,590 మంది రైతులకు ఈ నిధులను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదారులు, సాగుదారులకు నగదు జమ చేయడం ఇది రెండో సారి.

అయితే తొలివిడతగా శుక్రవారం రూ. 2,800 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానుంది. గత నెలలో తొలివిడత కింద రూ.2వేల చొప్పున రూ.875 కోట్లు జమ చేశారు. కాగా, సాధారణ లబ్ధిదారులు 46,28,767 మంది, చనిపోయిన వారి వారసులు 61,555, వెబ్‌ ల్యాండ్‌కు అనుసంధానం కాని వారు 2,12,025, దేవాదాయ భూముల రైతులు 623, అటవీ భూములు సాగు చేసుకునే వారు 40,620 మంది లబ్ధిదారులు జాబితాలో ఉన్నారు.

ఈ పథకం కింద రైతు కుటుంబాలకు రూ.13,500 మూడు విడతలుగా అందించనున్నారు. మొత్తంగా ఈ ఏడాదికి తొలివిడతలో రూ. 7,500 చొప్పున రూ.3,675 కోట్లు రైతుల ఖాతాలో జమ కానున్నాయి.

అలాగే భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతుల కుటుంబాలకు రూ. 13,500 సాయం అందించనున్నారు. ఈ వర్గాలకు చెందిన కౌలు రైతులకు ప్రభుత్వమే పూర్తి మొత్తాన్ని అందించనుంది. రైతులు ఇబ్బందులు పడకుండా 15వ తేదీ నుంచే నగదు జమ చేయనుంది ప్రభుత్వం.

Next Story
Share it