వారి పిల్లలు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారో నిలదీయండి..?: సీఎం వైఎస్ జగన్
By Newsmeter.Network Published on 21 Nov 2019 4:41 PM ISTముఖ్యాంశాలు
- 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
- బ్యాక్ వర్డ్ క్లాస్ లను బ్యాక్ బోన్ లుగా మార్చాలనుకుంటున్నా : సీఎం వైఎస్ జగన్
- గంగపుత్రులకు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం వైఎస్ జగన్
తూ.గో. జిల్లా: ఆరు నెలలు కాకముందే హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గొప్ప గొప్ప పనులు చేస్తున్నా అపనిందలు వేస్తున్నారని వాపోయారు. మీ పిల్లలు, మీ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారో నాయకులను, ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న పత్రికాధిపతుల్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు వాచ్‌మెన్, డ్రైవర్ల లాంటి ఉద్యోగాలకే పరిమితం కావాలా? అని ప్రశ్నించారు. ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు లాంటి పెద్ద చదువులు చదవాలని తాను తాపత్రయపడుతున్నట్లు చెప్పారు. ఏ చెడు చేయకపోయినా, ప్రజలను మభ్య పెడుతున్నారని సీఎం జగన్ వాపోయారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాక్‌వర్డ్ క్లాసులను బ్యాక్ బోన్ క్లాసులుగా మార్చాలనుకుంటే తనను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అపనిందలు వేసినా ప్రజల కోసం తట్టుకోగలను అన్నారు. ప్రజల దీవెనలతో మంచి చేస్తానని చెప్పారు.ఇంకా గొప్ప పాలనను అందించడానికి శాయశక్తులా కృషిచేస్తానపని సీఎవ జగన్ హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కోమానపల్లి గ్రామంలో "వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా" పథకాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.
మత్స్యకారులపై వరాల జల్లు
నిషేధ కాలంలో సముద్రంలో వేటకు వెళ్లే కుటుంబానికి ఇకపై రూ.10 వేల సహాయం అందిస్తామన్నారు సీఎం వైఎస్ జగన్. డీజిల్‌పై సబ్సిడీ రూ.9లకి పెంచుతున్నట్లు ప్రకటించారు. నెలకు 3వేల లీటర్ల డీజిల్ ఇస్తామన్నారు. వేటలో మరణించే మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.
బోటింగ్ కంట్రోల్ గదుల నిర్మాణానికి శంకుస్థాపన
అంతకు ముందు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. 9 టూరిజమ్ బోటింగ్ కంట్రోల్ గదుల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరించారు. కృష్ణా, గోదావరి తీర ప్రాంతాల్లో ఈ కంట్రోల్ గదులు నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.62 కోట్లు విడుదల చేసింది.
మత్స్యకారులకు రూ.78.22 కోట్లు విడుదల
ఆ తర్వాత ‘వైయస్సార్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్, జీఎస్‌పీసీ బకాయి రూ.78.22 కోట్ల నిధులను మత్స్యకారులకు అందజేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజు ..మత్స్యకారులకు వరాలకు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్.
మన రాష్ట్రంలో 974 కి.మీ తీర ప్రాంతం ఉన్నా, బతుకుతెరువు కోసం వలసలు పోతున్న వారిని చూశానన్నారు సీఎం జగన్ . అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి గంగపుత్రుల జీవితాలు మార్చే నిర్ణయాలు ప్రకటిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.వైఎస్ జగన్ వరాలపై మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు.