జగన్ కు ఘనస్వాగతం పలికిన విశాఖ వాసులు

By రాణి
Published on : 28 Dec 2019 5:15 PM IST

జగన్ కు ఘనస్వాగతం పలికిన విశాఖ వాసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. జగన్ విశాఖకు చేరుకోగానే అక్కడి ప్రజలు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే రాజధాని విశాఖేనని ఖరారు చేయకపోయినప్పటికీ ఏపీకి మూడు రాజధానులుండొచ్చని జగన్ చెప్పిన వాటిలో విశాఖ కూడా ఒకటి. ప్రజలు రోడ్లకు ఇరువైపులా ''Thank you జగనన్న'' ప్లకార్డులు పట్టుకుని స్వాగతం పలికారు. జగన్ కు జై కొడుతూ..ఆయనపై పూలవర్షం కురిపిస్తున్నారు. ప్రజలందరికీ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

పిల్లలు, పెద్దలంతా జగన్ తో కరచాలనం చేసేందుకు వెంటబడ్డారు. డివైడర్ల మధ్యలో జగన్ కటౌట్లు, విశాఖలో జగన్ పర్యటనతో నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. సుమారు 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించారు. విచిత్ర వేషధారణలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో వైజాగ్ రోడ్లలో సందడి నెలకొంది. ఆర్ కే బీచ్ వద్ద జరిగే విశాఖ ఉత్సవ్ ను జగన్ ప్రారంభిస్తారు. అలాగే రూ.60లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ను జగన్ సందర్శించనున్నారు. ఈ ఫ్లవర్ షో లో దేశ విదేశాలకు చెందిన పుష్ప జాతులు, వివిధ ఆకృతుల్లో ఉన్న పుష్పాలు ఆకట్టుకుంటున్నాయి.

శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆంధ్రా రాజధాని మార్పుపై స్పష్టమైన ప్రకటన వస్తుందని ఇటు సీమ ప్రజలు, అటు వైజాగ్ వాసులు ఎదురు చూశారు. మరోవైపు అమరావతి రైతులు రాజధానిని మారిస్తే రక్తం చిందించైనా రాజధానిని కాపాడుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..కొత్త సంవత్సరం మొదటి వారంలో వచ్చే నివేదిక ఆధారంగా రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పడంతో ఏపీలో రైతుల నిరసన 11వ రోజుకు చేరింది.

Next Story