ఏపీ సీఎం వైఎస్ జగన్ పీఎం మోదీకి ఏం చెప్పారు..ఏం అడిగారు..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 4:49 PM GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ పీఎం మోదీకి ఏం చెప్పారు..ఏం అడిగారు..?!

ఢిల్లీ: ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. 'వైఎస్ఆర్‌ రైతు భరోసా' పథకానికి రావాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ ఆహ్వానించారు. గంటన్నరపాటు ప్రధానితో ఏపీ సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలను ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి భేటీకి సంబంధించిన ముఖ్యాంశాలు..

1).వైఎస్ఆర్ రైతు భరోసా

'వైఎస్ఆర్‌ రైతు భరోసా' పథకానికి ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ ఆహ్వానించారు. అక్టోబర్‌ 15న నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న రైతు భరోసా పథకానికి హాజరు కావాలని ప్రధానిని ఆహ్వానించారు జగన్. పథకం ప్రారంభం రోజునే రాష్ట్రంలో కౌలు రైతులతో సహా మొత్తం 53 లక్షల మందికి లబ్ధి.

2). అదనపు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోసం విజ్ఞప్తి

కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.61,071.51 కోట్లు అవసరమవుతాయని గత ప్రభుత్వం ఓటాన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌లో పేర్కొంది. అందుకే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద వీటికి అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.

3). రెవెన్యూ లోటు

2014–15లో రాష్ట్రాన్ని విభజించిన సమయంలో రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లుగా కాగ్‌ అంచనా వేసింది . కాని.. ఇప్పటి వరకూ రూ.3,979.50 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి.

ఇంకా రూ.18,969.26 కోట్లు రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ఇవ్వాల్సిన రూ.18,969.26 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా ప్రధానిని కోరారు సీఎం వైఎస్ జగన్.

4). పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలు ఆమోదించాలి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కోసం రూ.5,103కోట్లను ఖర్చు చేసిందన్నారు. వాటిని రీయింబర్స్ చేయాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.838 కోట్లు ఆదా

2014–19 మధ్య పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ వేశామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ జగన్. నిపుణుల కమిటీ అభిప్రాయం మేరకే పాత కాంట్రాక్ట్ ను రద్దు చేశామన్నారు. పోలవరం పనులను రివర్స్ టెండరింగ్ చేయడం ద్వారా రూ.838 కోట్ల ఆదా అయ్యాయని సీఎం జగన్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో హెడ్‌ వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు పనుల మొత్తం రూ.780 కోట్లు కాగా, టన్నెల్ పనులకు సంబంధించిన రూ.58 కోట్లు ఆదా అయ్యాయి.

5). వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి

వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని బుందేల్‌ఖండ్‌, కలహండి తరహాలో ప్రకటించారు. యూపీలోని బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లోని కలహండిలో తలసరి రూ.4 వేలు కేటాయించారు. ఏపీలో మాత్రం ఆ మొత్తం కేవలం రూ.400 మాత్రమే. ఈ ప్యాకేజీని మార్చాలన్నారు జగన్. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఈ 6 ఏళ్లలో రూ.2,100 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ రూ.1,050 కోట్లు మాత్రమే వచ్చాయని మోదీ దృష్టికి తీసుకెళ్లారు జగన్.

5.1). కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం

కృష్ణా డెల్టా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. కృష్ణా జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో సాగు నీటిని స్థిరీకరించాల్సి ఉందని పీఎం దృష్టికి తీసుకెళ్లారు జగన్. రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా సాగు, తాగు నీటి వనరైన శ్రీశైలం రిజర్వాయర్ కు నీటి సరఫరా గత 52 ఏళ్లుగా చూస్తే 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. మరోవైపు ..గత 30 ఏళ్లుగా ఏటా సగటున ధవళేశ్వరం వద్ద 2,780 టీఎంసీల గోదావరి వరద జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని ప్రధానికి జగన్ చెప్పారు. గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించేలా సంబంధిత కేంద్ర శాఖలకు ఆదేశాలివ్వాలని ప్రధానిని కోరారు జగన్.

6). రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులకు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టులను కేంద్రం నిర్మించాల్సి ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకమైనవని చెప్పారు. విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియ్‌ కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌కూ తగిన రీతిలో నిధులు కావాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు జగన్.

7). నవరత్నాలుకు చేయూతనివ్వండి

నవ రత్నాలు గురించి ప్రధాని మోదీ దగ్గర ప్రస్తావించారు వైఎస్ జగన్. కొత్త శకానికి నవ రత్నాలు నాంది పలుకుతున్నాయన్నారు. నవరత్నాలకు కేంద్ర సాయం కోరారు జగన్‌.

8). ప్రత్యేక హోదా ఇవ్వాలి

ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని డిమాండ్ చేశారు జగన్‌. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా రూ.1.46 లక్షల నుంచి రూ.1.29 లక్షలకు పడిపోయిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితి మారాలంటే రాష్ట్రంలో పరిశ్రమలు, సేవా రంగం ఎంతో పురోగమించాల్సి ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరారు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలకు రాయితీలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా పెట్టుబడులు వస్తాయన్నారు. పరిశ్రమలకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వకపోతే సహజంగా పెట్టుబడిదారులు మెట్రో నగరాలైన చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వైపు చూస్తారని ప్రధానికి చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

Next Story