చిరుతో భేటీ వెనుక జగన్‌ లెక్కలు జగన్‌కు ఉన్నాయా?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 9:20 AM GMT
చిరుతో భేటీ వెనుక జగన్‌ లెక్కలు జగన్‌కు ఉన్నాయా?!

రాజకీయం అందరూ చేస్తారు. రాజకీయం చేసే కళ కొందరికే అబ్బుతుంది. రాజకీయ చదరంగంలో గెలుపే ప్రధానం. కాని..విలువలు కూడా పాటించాలి. మహాత్మాగాంధీ, మేకియావెళ్లి ఇద్దరూ రాజనీతి తత్వవేత్తలే. కాని..ఇద్దరి ఆలోచనలు వేరు. ఇద్దరిదారులు వేరు. "నీవు విలువలతో కూడిన రాజకీయాలు చేసి మాత్రమే లక్ష్యాన్ని సాధించాలి" అంటారు మహాత్మ గాంధీ. "రాజకీయంలో నీవు ఏమైనా చేయి..లక్ష్యాన్ని మాత్రం సాధించు"అంటారు మేకియా వెల్లి. వీరిద్దరి మాటలను ఇక్కడ ఎందుకు గుర్తు చేశానో..ఈ ఆర్టికల్ పూర్తిగా చదివితే అర్ధమవుతుంది.

అక్టోబర్2, మహాత్మగాంధీ జయంతి. ఓ స్వాతంత్ర్య పోరాట యోధుడి కథ సినిమా రిలీజ్ అయింది. అదిరిపోయే విజయం సాధించింది. అమెరికా నుంచి ఆంధ్ర దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇదే సమయంలో 'సైరా' చిరంజీవి ఏపీ సీఎం జగన్ తో భేటీ కావాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువుగా అపాయింట్ మెంట్ తీసుకుని..సతీమణి సురేఖతో సహా ఏపీ సీఎం జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. పైకి మర్యాదపూర్వక భేటీ, సినిమా సంగతులు మాట్లాడుకున్నారని చెబుతున్నప్పటికీ..రాజకీయంగా కూడా మాటలు నడిచాయని అమరావతిలో అనుకుంటున్నారు.

ఒకపక్క చిరంజీవి తమ్ముడు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నప్పటికీ .. చిరు కుటుంబాన్ని దూరం పెట్టదల్చుకోలేదని ఈ భేటీతో సంకేతాలు పంపారు వైఎస్ఆర్‌ సీపీ అధినేత. జనసేన అభిమానులు వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో ఉన్నదిలేనిది ప్రచారం చేస్తున్నా..ఈ సమావేశానికి ఆ పోస్ట్‌లు అడ్డుగోడలై అడ్డుపడలేదు. చిరుతో భేటీతో వైఎస్ జగన్ తన రాజకీయ చాతుర్యాన్ని చాటుకున్నాడు. చిరు కుటుంబం మీద తనకు ఎలాంటి ఆగ్రహంలేదని ..అందరం కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దామనే సంకేతాలు పంపారు.

ప్రజారాజ్యం పార్టీ విఫలమైనా..చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నా..ఏపీలో మెగస్టార్‌ కుటుంబానికి ఒక బలమైన సామాజికవర్గం అండగా ఉందనేది సత్యం. చిరంజీవి రాజకీయంగా ఫెయిల్ అయినప్పటికీ..ప్రజారాజ్యం పార్టీకి 20కిపైగా అసెంబ్లీ సీట్లు వచ్చాయనే విషయం జగన్‌కు గుర్తులేదని అనుకోలేం. గత ఎన్నికల్లో జనసేనకు దాదాపుగా 10 శాతం ఓట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్‌ సీపీ అధినేత మదిలో ఉంటాయి. మంచిగా ఉంటే పోయేదేమీ లేదు..లాభమే కదా అనే సూత్రాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇక్కడ పాటించారని వైఎస్ఆర్‌ సీపీ నేతలు అంటున్నారు.

చిరంజీవిని దగ్గరకు తీసుకోవడం వలన ఏపీలో ఉన్న బలమైన కాపు సామాజికవర్గంలో వైఎస్ జగన్‌కు పరపతి పెరుగుతుందే కాని..తగ్గదు. ఉభయ గోదావరి జిల్లాల్లో 5 లోక్ సభ సీట్లు 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ. చిరంజీవి కుటుంబానికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. చిరుతో మంచిగా ఉంటే ఆయన అభిమానులు కూడా జగన్ వెంట నడిచే అవకాశముంది. ఇది జగన్ కు లాభమే కాని నష్టం కాదు.

ఇక...ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత టాలీవుడ్ నుంచి కొందరు మాత్రమే జగన్‌ను వచ్చి కలిశారు .వారు కూడా చిన్నాచితక నటులు. చిరుతో భేటీ తరువాత టాలీవుడ్‌లో కూడా సమీకరణలు మారే అవకాశముంది. ఇదే విషయంపై వైఎస్ఆర్ సీపీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానిస్తూ..తెలుగు సినీ పరిశ్రమలో కూడా వైఎస్ఆర్ సీపీ తన మార్క్‌ ను చూపించాలన్నారు. తెలుగు సినీ పరిశ్రమను కొంతవరకైనా విశాఖకు తీసుకురావాలనేది వైఎస్ఆర్ సీపీ నేతల ఆలోచనగా ఉంది. ఈ విషయంలో చిరు, సీఎం జగన్ ల మధ్య చర్చలు జరిగి ఉంటాయని వైఎస్ఆర్ సీపీ నేతలు భావిస్తున్నారు.

ఇక చిరుతో జగన్ భేటీ తరువాత ఇప్పటి వరకు పవన్ కల్యాణ్, జనసేన సైనికులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంతలేదన్నా...జగన్ పై గతంలో ఉన్న దూకుడు విమర్శలు జనసేన నుంచి ఉండవని అమరావతిలో టాక్‌ నడుస్తోంది. మొత్తానికి చిరు భేటీతో కాపు సామాజిక వర్గంతోపాటు, టాలీవుడ్‌లో కూడా వైఎస్ జగన్ కు సానుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ..వైఎస్ఆర్‌ సీపీలో బలమైన కాపు సామాజిక వర్గ నేతలు ఉన్నారు. చిరు భేటీతో ఆ సామాజిక వర్గంలో వైఎస్ జగన్ కు తిరుగుండదని చెప్పుకోవచ్చు.

కాపులు చంద్రబాబు కంటే వైఎస్ఆర్‌నే ఎక్కువుగా విశ్వసించేవారు. వైఎస్ఆర్ తరువాత, రాష్ట్ర విభజన తరువాత కాపులు చంద్రబాబు వైపు ఉన్నప్పటికీ..కొన్ని రోజుల్లోనే ఆయన పంచ వీడి..జగన్ దగ్గరకు చేరుకున్నారు. వైఎస్ జగన్ విలువల గల రాజకీయం చేస్తున్నారని..చంద్రబాబు మాత్రం అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని కాపుల అభిప్రాయం. కాపు నేత ముద్రగడ కుటుంబాన్ని కొట్టించడం, జైల్లో పెట్టడం, ఆస్పత్రిలో నిర్బంధించడం, కాపు యువతపై కేసులు పెట్టి వేధించడాన్నిఆ జాతి ప్రజలు మరిచిపోవడంలేదు. ఇదే సమయంలో వైఎస్ జగన్ కాపులకు నమ్మకమైన నాయకుడిగా దొరికారు. అందుకే..జగన్ ప్రమాణస్వీకారానికి చిరు రానప్పటికీ..ఇప్పుడు వచ్చి కలిసి ఆత్మీయంగా పలకరించి.భోజనం చేసి వెళ్లారు.

ఇప్పుడు మరోమారు మహాత్మగాంధీని, మేకియా వెల్లిని మళ్లీ గుర్తు చేస్తాను. మేకియా వెల్లి చెప్పినట్లు అనైతిక రాజకీయాలకు పాల్పడితే చంద్రబాబును ఛీదరించుకున్నట్లు ప్రజలు ఛీదరించుకుంటారు. మహాత్మ గాంధీ చెప్పినట్లు.. విలువలగల రాజకీయాలు చేస్తే ...కొంచెం లేటైనా మనకు దూరంగా ఉన్నవారు దగ్గర అవుతారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఇప్పుడు జరుగుతుందిఇదే.

వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్‌, న్యూస్ మీటర్

Next Story