ఎల్వీఎస్ బదిలీకి కారణాలు ఇవేనా..?!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 8:08 AM GMT
ఎల్వీఎస్ బదిలీకి కారణాలు ఇవేనా..?!!

ముఖ్యాంశాలు

  • రెండునెలలుగా సీఎం వైఎస్ జగన్, ఎల్వీఎస్ మధ్య గ్యాప్
  • జగన్ నేను చెప్పినట్లు వినడంలేదని ఐఏఎస్ లకు చెప్పిన ఎల్వీఎస్
  • చెప్పినట్లు వినకపోతే చంద్రబాబు గతి పడుతుందన్న ఎల్వీఎస్
  • పీపీఏలు విషయంలో కేంద్రం ఆలోచనకు తగ్గట్లు ఎల్వీఎస్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అధికారులకు తెలిసి వచ్చి ఉంటుంది. అధికారులకే కాదు..రాజకీయ నేతలకు కూడా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్‌ అయ్ ఉంటుంది. ఎల్వీఎస్ బదిలీకి గత రెండు నెలలుగా సీఎం, సీఎస్ మధ్య ఉన్న అభిప్రాయభేదాలే కారణమని సమాచారం. ముఖ్యమంత్రి, కేబినెట్ నిర్ణయాలకు సీఎస్ ఏమాత్రం విలువ ఇవ్వడంలేదని గత కొన్నాళ్లుగా అమరావతిలో ఉన్న పాత్రికేయులకు, రాజకీయ నేతలకు అందరికీ తెలిసిందే. అయితే.. నిర్ణయం ఇంత త్వరగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

అయితే..కొన్ని విషయాల్లో సీఎం వైఎస్ జగన్ చాలా నిక్కచ్చిగా ఉంటున్నారు. ముఖ్యంగా రివర్స్ టెండరింగ్, పీపీఏల విషయంలో సీఎం జగన్ దూకుడుతోపాటు..కచ్చితత్వంతో ఉంటున్నారు. ఈ విషయంలో సీఎస్‌గా ఉన్న ఎల్వీఎస్‌ అనుకున్నంతగా సహకరించడంలేదని అమరావతి సర్కిల్‌లో టాక్‌. ఈ విషయంలో కేంద్రం ఆలోచనలకు తగ్గట్లు ఎల్వీఎస్ నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..తన ఆలోచనలకు తగ్గట్లు పని చేసే చురుకైన అధికారులు కావాలని జగన్ కొన్ని రోజులుగా అడుగుతున్నారు. పేర్లు సూచిస్తే..ఆ పేర్లు ఉన్న ఫైల్‌ను ఎల్వీఎస్ తొక్కి పెడుతున్నట్లు సమాచారం.

ప్రవీణ్‌ ప్రకాష్‌కు జారీచేసిన నోటీసుల్లో రెండు కారణాలను ఎల్వీ సుబ్రహ్మణ్యం చూపించారు. వాస్తవానికి ఆ రెండు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో, ఇతర అధికారులు, సీఎస్‌ ఉన్నప్పుడు తీసుకున్నవే. ఆ నిర్ణయాలు సీఎస్‌కు తెలియకుండా జరిగినవి కావు. వైఎస్ఆర్ పేరు మీద లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల విషయంలో సీఎస్ ఓకే కూడా చెప్పారు. కాని..ప్రవీణ్ ప్రకాష్ ఫైల్ తయారు చేశాక..ఎల్వీఎస్‌ ఆర్ధిక శాఖ అనుమతి లేదని తిప్పి పంపారు. వాస్తవానికి ఆర్థికశాఖ అనుమతితో సంబంధం లేకుండా ఫైలును కేబినెట్‌లో పెట్టొచ్చు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఆర్థికశాఖతో సమన్వయం చేసుకోవచ్చు. సీఎం ఎదుట ఓకే అని, ఆ తర్వాత కొర్రీ పెట్టడం సీఎస్‌పై సీఎం ఆగ్రహానికి దారితీసి ఉండొచ్చు.

ఏ నిర్ణయాలు కూడా ఎల్వీఎస్‌కు తెలియకుండా తీసుకున్నవి కాదు. అంతేకాక, సీఎస్‌ సమక్షంలోనే ఆయనకు చెప్పే ముఖ్యమంత్రి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరస్పర విశ్వాసం ఉండాలనే ఆలోచనతో సీఎం దాపరికం లేకుండా నడుచుకున్నారని తెలుస్తోంది. అయితే..ఎల్వీఎస్ మాత్రం కాలయాపనకు, అనుమానాలకు దారి ఇచ్చేలా నడుచుకున్నారని అమరావతి సర్కిల్‌లో టాక్‌. అంతేకాదు..వైఎస్ జగన్ చెప్పినా కూడా ..సీఎం కార్యదర్శికి షోకాజ్ ఇవ్వడాన్ని ఏ ముఖ్యమంత్రి ఈజీగా తీసుకోరు. ఫలితమే..ఎల్వీఎస్ బదిలీ.

Next Story