రూ.3వేల కోసం 5 హత్యలు..
By తోట వంశీ కుమార్ Published on 8 March 2020 1:38 PM IST
రూ.3వేల కోసం ఐదుగురిని హత్య చేసిన యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి కంటోన్మెంట్ ఒత్తకడై ప్రాంతంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. రాంజీనగర్‌కు చెందిన సెంథిల్‌కుమార్ ఇక్కడ నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 2న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఓ యువకుడు తలపై బండరాయి మోది హత్య చేసేందుకు యత్నించాడు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో చనిపోయాడేమో అనుకుని అతడి వద్దనున్న వెయ్యి రూపాయిలు, సెల్‌ఫోన్ తీసుకుని పారిపోయాడు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పుదుక్కోట్టైకి చెందిన రాజేశ్‌కుమార్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు బయటపడ్డాయి. రాజేష్‌కుమార్ ఇదే విధంగా సేలం టౌన్‌లో గత ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ముగ్గురు వాచ్‌మెన్‌లను ఇదే తరహాలో హతమార్చి నగదు చోరీ చేసినట్లు తెలిసింది.
2009లోనూ నాలుగేళ్ల బాలుడిని హత్య చేసి అతడి మెడలోని వెండి గొలుసును చోరీ చేశాడు. 2015లో భిక్షాటన చేసే వృద్ధురాలిని హతమార్చి రూ.300 నగదు తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇతను కేవలం రూ.3వేల కోసం ఐదుగురిని హతమార్చినట్లు విచారణలో తేలింది. అతను సైకో హంతకుడుగా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో రాజేష్‌కుమార్ తండ్రి సంరక్షణలో జులాయిగా పెరిగాడు. నాలుగు నెలల క్రితం తండ్రి కూడా కాలం చేయడంతో అనాథగా మారాడు. గంజాయికి అలవాటు పడిన అతడు డబ్బు కోసం నేరాల బాట పట్టాడు.