కోటి ఆశలతో కొత్త తరం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు

By Newsmeter.Network  Published on  26 Jan 2020 6:10 AM GMT
కోటి ఆశలతో కొత్త తరం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు

అది యువతరం. వేడి నెత్తురు, వాడి ఆలోచనలు.. ఇనుప కండరాలు, ఉక్కునరాలు.. వినూత్న డిగ్రీలు, కార్పొరేట్ ఉద్యోగాలు.. ఇలాంటి వాళ్లు ఇప్పుడు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. కొత్త ఊహలతో, కోటి ఆకాంక్షలతో పదవులు చేపడుతున్న నవతరం నాయకులు ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ!! కాకలు తీరిన రాజకీయ యోధుల పక్కన వేదిక నెక్కి కూర్చునే అర్హత సంపాదించుకున్నారు వీళ్లు. వీరందరూ తొలి సారి పోటీ చేసి గెలిచారు. అందరూ 30 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు.

కొంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన శ్రీవిద్య ఎమ్మెస్సీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. “వోటర్లు నన్ను నా డిగ్రీ వల్ల గెలిపించలేదు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేయగలనని నమ్మి గెలిపించారు. నేను వారి ఆశలకు అనుగుణంగా శ్రమిస్తాను” అని శ్రీవిద్య అన్నారు. నిజాంపేట లో 28 వార్డునుంచి గెలిచిన ధనంజయ్ యాదవ్ కి 30 ఏళ్లు. చిన్నప్పట్నుంచీ విద్యార్థి ఉద్యమాల్లోపాల్గొన్నాడు. విజయాలు సాధించాడు. ఇప్పుడు రాజకీయాల ద్వారా సామాజిక మార్పు తెచ్చే లక్ష్యంతో పనిచేస్తానంటున్నాడు. వ్యాపారస్తుడిగా ఉంటూనే రాజకీయాల్లో రాణిస్తున్నాడు.

మణికొండలో తొలి సారి బరిలోకి దిగి విజయాన్ని సాధించిన బిజెపి నాయకుడు నవీన్ ఆలస్యం కూడా యువకుడే. వయసు 38 ఏళ్లు. ఐటీ ఉద్యోగం చేస్తూ, రాజీనామా ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇప్పటికీ ఆయన ఇంకా నోటీసు పీరియడ్ లోనే ఉన్నాడు. మెరుగైన రోడ్లు, మంచి నీటి సదుపాయం తన వోటర్లకు అందించడమే ఆయన లక్ష్యమని అంటున్నాడు. ఒక బహుళ జాతి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సూర్యకళ కూడా తన ఉద్యోగాన్ని వదిలేసి మరీ రాజకీయాల్లోకి దిగింది. ఎమ్సెస్సీ మ్యాథమెటిక్స్ చదివిన సూర్యకళ కొంపల్లి నుంచి బిజెపి అభ్యర్థిగా నిలిచి గెలిచింది. ఆమె వివాహిత, ఇద్దరు పిల్లలు. అయినా కుటుంబాన్ని సంభాళించుకుంటూనే ప్రజా సేవలో తరిస్తానంటోంది సూర్యకళ. కొంపల్లి నుంచి గెలిచిన జ్యోత్సనా దేవి ఎంసీయే చదివింది. మేడ్చల్ నుంచి గెలిచిన దీపికా రెడ్డి ఎంబీయే చదివింది.

రాజకీయ అవగాహనతో, నవ చైతన్యంతో యువత ముందుకొచ్చి బరిలోకి దిగి పోరాటం చేసి గెలిచిన ఈ తరం నిజంగా కోరుకున్న మార్పును తేగలిగితే ఇంక కావాల్సిందేమిటి? కొత్త తరం రాజకీయాలకు స్వాగతం చెబుదాం. వారు పాతవారిలా గిడసబారిపోకుండా తమ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తారని ఆశిద్దాం.

Next Story