తొక్కలో గిఫ్ట్ -గెంతులేసిన చిన్నారి
By రాణి Published on 24 Dec 2019 10:46 AM ISTక్రిస్మస్ పండుగ అంటే పిల్లలు ముందుగా కోరుకునేది సర్ప్రైస్ గిఫ్ట్లు. సీక్రెట్ శాంటా వస్తాడని, తాము కోరుకున్న గిఫ్ట్ లు ఇస్తాడని వారు ఎదురు చూస్తుంటారు. ఇక స్వీట్లు, కేకుల సంగతి చెప్పక్కరలేదు. అందుకే ఇది పిల్లలు మర్చిపోలేని పండుగ. అందుకున్నది ఎంత చిన్న వస్తువైనా కానీ ఆనందించే గుణం చిన్నపిల్లలోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బుజ్జితల్లికి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాకవకుండా ఉండలేరు. ఒక యూట్యూబర్ తన రెండేళ్ల కూతురితో ప్రాంక్ వీడియో చేద్దామనుకున్నాడు. ఒక గిఫ్ట్‌ను ప్యాక్ చేసి కుమార్తె చేతికిచ్చాడు. బుజ్జితల్లి తన చిట్టిచిట్టి చేతులతో గిఫ్ట్‌ను తెరచి చూస్తే అందులో ఉన్నది అరటిపండు.
కానీ ఆ పాప తల్లిదండ్రులు ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ముఖం ముడుచుకోలేదు సరికదా ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అరటిపండును అందుకున్న చిన్నారి అమితాశ్చర్యంతో కళ్లింత చేసుకుని ఆనందంతో గంతులు వేసింది. ‘బనానా.. బనానా..’ అంటూ కేరింతలు కొట్టింది. ఎంతగానో సంబరపడింది. ముద్దుముద్దు మాటలతో అరటి పండు తొక్కతీసి ఇవ్వమని తల్లిని అడిగింది. తొక్కతీయగానే వెంటనే పట్టలేని సంతోషంతో తినేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
నిజానికి లెజెండ్ అన్న పేరుతో ప్రాంక్ వీడియోలు చేసే పాప తండ్రి కూతురికి వరెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలని, అది చూసి తనపాప డిస్సపాయింట్ అయ్యే వీడియో తియ్యాలని అనుకొని రికార్డింగ్ మొదలు పెట్టాడంట. కానీ పాప రియాక్షన్ చూసి పేరెంట్స్ కూడా షాక్ అయ్యారట. ఈ వీడియోను ట్విట్టర్ లో 20 మిలియన్ల మంది, ఇంస్టాగ్రామ్ లో 6 లక్షల మంది చూశారట. అయ్యో పాపం చంటిదాన్ని పేరెంట్స్ ఎంత మోసం చేశారు అని మీరు ఫీల్ అవ్వకండి. తరువాత పాపకి చాలా బొమ్మలు కొన్నారట తల్లిదండ్రులు.