జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

By సుభాష్  Published on  10 March 2020 10:19 AM GMT
జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు కలిశారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల పేర్లను ఇటీవల సీఎం జగన్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణ, గుంటూరు అయోధ్య రామిరెడ్డిలను రాజ్యసభకు పంపుతానని వైసీపీ ప్రకటనతో వారు ఈరోజు జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. జగన్‌కు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించారు. వారితో జగన్‌ కొంత సేపు మాట్లాడారు. కాగా, ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ నత్వానీని కూడా వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి మొత్తం నాలుగు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక పరిమళ్‌ నత్వానీ రిలయన్స్‌ అధిపతి ముఖేష్‌ అంబానీకి అత్యంత సన్నిహితుడు. అంబానీ అభ్యర్థన మేరకే నత్వానీని జగన్‌ రాజ్యసభ సీటును ఖరారు చేశారు. గత నెల 29న ముఖేష్‌ అంబానీ జగన్‌ను కలిశారు. ఆ సమయంలో అంబానీతో పాటు నత్వానీ కూడా వచ్చారు. జగన్‌, అంబానీల మధ్య పరిశ్రమలు, పెట్టుబడులపై జరిగింది. అంతేకాకుండా నత్వానీ రాజ్యసభ సీటుపై చర్చకు రావడంతో నత్వానీ పేరును ఖరారు చేశారు జగన్‌.

పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సీటు ఖరారు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖేష్‌ , నత్వానీలకు కమలం పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. దీంతో వారి పరిచయాన్ని తమ రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలని జగన్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it