అయ్యో.. నా అవార్డు ముక్కలైందే..!
By Newsmeter.Network
ఎవరైనా అరుదైన ఘనతకు గుర్తుగా ఇచ్చిన జ్ఞాపికను ఏం చేస్తారు..? ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీలు కుదిరినప్పుడెల్లా వాటిని శుభ్రం చేస్తూ.. సాధించిన ఘనతలను గుర్తు చేసుకుంటారు. ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారించాడు. 88, 105 నాటౌట్, 62, 57 నాటౌట్, 29 నాటౌట్, 59 పరుగులతో మొత్తం 400 పరుగులతో రాణించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. అయితే స్వదేశానికి వచ్చిన తరువాత చూస్తే.. రెండు ముక్కలై కనిపించిందంట. అయితే అది ఎలా జరిగిందో మాత్రం అతనికి గుర్తు లేదట.
కాగా దీనిపై అతని కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడాడు. ఆ ట్రోఫి ముక్కలైనా జైస్వాల్ పెద్దగా ఏమీ బాధపడడన్నారు. ఇలా జరగడం తొలిసారేం కాదన్నాడు. జైస్వాల్.. పరుగుల కోసం ఆలోచిస్తాడే తప్ప అవార్డుల గురించి కాదన్నాడు.
ఇకపోతే.. ఫైనల్‌లో చెత్త షాట్ కొట్టి అవుట్ కావడం పట్ల జైస్వాల్ బాధపడుతున్నాడట. ఆ సమయంలో బంతి తను అనుకున్న దానికన్న వేగంగా వచ్చిందన్నాడు. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేదని.. అయితే దీంతోనే ప్రపంచం ముగిసిపోదుగా అని అన్నాడు ఈ యువ ఆటగాడు.