పేరు గుర్తుంది కదూ.. జైశ్వాల్.. యశస్వీ జైస్వాల్..!

By రాణి  Published on  10 Feb 2020 9:57 AM GMT
పేరు గుర్తుంది కదూ.. జైశ్వాల్.. యశస్వీ జైస్వాల్..!

2020 అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ లో చతికిలబడింది. ఫైనల్ లో బంగ్లా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి ట్రోఫీని ఎగరేసుకొని వెళ్లిపోయారు. ఫైనల్ లో కూడా ఒకే ఒక్క భారత కుర్రాడు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిచాడు. అతడే యశస్వీ జైస్వాల్.. అతడి ఆటతీరు అమోఘం.. అద్భుతమైన షాట్స్ తో టోర్నీ మొత్తం అలరించాడు. ఇంకాస్త రాటుదేలితే తప్పకుండా భారత జట్టు పిలుపు అందుతుందని.. ఇప్పటికే మాజీ ఆటగాళ్లు అతడి ఆటతీరును చూసి చెబుతున్నారు. ఫైనల్ లో అన్ని రంగాల్లో రాణించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ను కూడా అందుకున్నాడు. భారత్ కు వికెట్ దక్కాలంటూ అతడు ఆకాశం వైపు చూసి వేడుకోవడం పలువురిని బాధపెట్టింది. ఒక్క ఆటగాడు మాత్రమే అద్భుతమైన ప్రదర్శన ఇస్తే సరిపోదని యశస్వీ జైస్వాల్ ఒక ఉదాహరణ.

మొత్తం ఆరు మ్యాచ్ లు ఆడిన యశస్వి జైస్వాల్ 400 పరుగులు ఈ టోర్నమెంట్ లో చేశాడు. ఒక సెంచరీ.. నాలుగు సెంచరీలు సాధించిన యాశస్వీ 133 యావరేజ్ తో రాణించాడు. ముంబైకు చెందిన ఈ క్రికెటర్ పేరు ప్రస్తుతం మారు మ్రోగిపోతోంది.

పానీపూరి అమ్మిన దగ్గర నుంచి భారత జాతీయ జట్టుకు ( అండర్ 19 ) ఎదిగిన యువకెరటం యశస్వి జైస్వాల్

గత కొద్ది రోజులుగా భారత క్రికెట్ అభిమానుల మాటల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యశస్వి జైస్వాల్. ఎక్కడో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామం నందు జన్మించాడు యశస్వి జైస్వాల్. తండ్రి జీవనోపాధి కోసం ముంబై రావడంతో అతడు కూడా వచ్చేశాడు. చిన్నతనం నుంచే క్రికెట్ మీద అమితమైన అభిమానం పెంచుకున్నాడు. 10 ఏళ్ల వయసులోనే జైస్వాల్ సాయంత్రం పూట మైదానం బయట పానీ పూరి అమ్ముతూ టెంటు కింద నిద్రించేవాడు. ఇలా మూడు సంవత్సరాలు పాటు తన తండ్రికి సాయంగా ఉన్నాడు. మొట్టమొదటిసారి యశస్వి పేరు 2015 సంవత్సరంలో ఒక స్కూల్ టోర్నీలో బయటికి వచ్చింది. ఆ టోర్నీలో జైస్వాల్ ఒక ట్రిపుల్ సెంచరీ తో పాటు 13 వికెట్లు తీశాడు. అక్కడి నుంచి మొదలైంది ఈ కుర్రాడి ప్రభంజనం. ఆ తర్వాత ఏకంగా ముంబై రంజీ జట్టులో స్థానం సంపాదించాడు మన యశస్వి జైస్వాల్. ఆ వెంటనే అండర్ 19 జట్టులో ఒక కీలక ఆటగాడిగా మారాడు.

ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా లో జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ జట్టులో ఓపెనర్ గా బరిలోకి దిగి టోర్నీలో అత్యధిక పరుగులు (400)సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు.

ఈ టోర్నీలో యశస్వి జైస్వాల్ 4 అర్ధ సెంచరీలు 1 సెంచరీ సాధించాడు. బాంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ లో 88 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతేగాక బంతితో ఒక వికెట్ తీసాడు. ఒక క్యాచ్ కూడా అందుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ మీద సెంచరీ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యశస్వి జైస్వాల్ ఒంటి చేత్తో మన భారత జట్టును ఫైనల్ కి చేర్చాడు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇవేగాక చిన్న వయసులోనే జైస్వాల్ సాధించిన పలు రికార్డులు పరిశీలిస్తే....

1.లిస్ట్ - ఏ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు.

2.గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాణ్ణి 2 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.

చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్ తన పట్టుదల, దృఢ సంకల్పంతో తక్కువ వ్యవధిలోనే భారత జట్టులోకి తలుపు తట్టడానికి ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి నాణ్యమైన ఆటగాళ్లను మన భారత జట్టుకు ఆడించడం బీసీసీఐ బాధ్యత..ఈ అండర్-19 స్టార్ విరాట్ కోహ్లీ లాగా భారత జట్టులో కీలక ఆటగాడిలా ఎదుగుతాడని ఆశిద్దాం.

Next Story