యాదాద్రి లడ్డూలు.. స్పీడ్ పోస్టులో కూడా..
By అంజి Published on 10 Feb 2020 4:27 AM GMTయాదాద్రి భువనగిరి: రాష్ట్ర ప్రజలకు అనేక సేవలను అందిస్తున్న తపాలా శాఖ.. ఇప్పుడ మరో వినూత్న సేవలకు తెరతీసింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి లడ్డూల కావాలనుకునే వారికి నేరుగా ఇంటికి పంపే ఏర్పాట్లను చేస్తోంది. స్పీడ్ పోస్టులో ఈ సేవలను అందించాలని తపాలా శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చెక్కెర లడ్డూతోపాటు బెల్లం పానకం లడ్డూలను కూడా యాదాద్రి దేవస్థానం భక్తులకు అందిస్తోంది. లడ్డూ ప్రసాద విషయంలోనే దేవాదాయశాఖ ప్రత్యేక చాటుతోంది. యాదాద్రితో పాటు వేములవాడ, బాసర, భద్రాచలం సహా మొత్తం 10 ఆలయాల నుంచి ప్రసాదాన్ని, అక్షింతలను కోరుకున్న భక్తులకు పంపించాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై తపాలా శాఖ అధికారులతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ యాప్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావలోని అధికారులు భావిస్తున్నారు.
తపాలశాఖ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో భక్తులైనా కోరుకున్న ఆలయం నుంచి ప్రసాదం తెప్పించుకోవచ్చు. ఆన్‌లైన్ పద్ధతుల్లో చెల్లింపులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు వరకు ఈ ఒప్పందం జరిగే అవకాశం ఉందని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ సంధ్యారాణి తెలిపారు. దేవాదాయశాఖతో చర్చలు జరుపుతున్నామన్నారు. బరువు ఆధారంగా పోస్టల్ ఛార్జీలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.