కరోనా: వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రి డాక్టర్‌ ఐ ఫెన్‌ అదృశ్యం..

By అంజి  Published on  1 April 2020 1:49 PM GMT
కరోనా: వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రి డాక్టర్‌ ఐ ఫెన్‌ అదృశ్యం..

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ గురించి చైనా దేశంలోని వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రి అధికారులను ముందుగానే హెచ్చరించి వారిలో ఒకరైన డాక్టర్‌ ఐ ఫెన్‌ మార్చి 31వ తేదీ నుంచి కనబడటం లేదు. అదే రోజున పీపుల్స్‌ మ్యాగ్‌జైన్‌లో డాక్టర్‌ ఐ ఫెన్‌ ఇంటర్య్వూ ప్రచురింపబడింది. ఆమె కనిపించకపోవడంతో చైనా ప్రజల్లో వివిధ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాలే ఆమెను కిడ్నాప్‌ చేశాయని వుహాన్‌కు చెందిన కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ కేసులు మొదట వెలుగు చూసింది వుహాన్‌లోనే అన్న విషయం తెలిసిందే.

డిసెంబర్‌ 30వ తేదీన వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రిలో ఓ రోగికి సార్స్‌ వైరస్‌ లక్షణాలు పోలిన లక్షణాలు కలిగిన మెడికల్‌ రిపోర్ట్‌ డాక్టర్‌ ఐ ఫెన్‌ దగ్గరికి వచ్చింది. సార్స్‌ లాంటి వ్యాధి అనే లేబుల్‌ను కలిగిన మెడికల్‌ రిపోర్టును ఆమె పరిశీలించి ట్విట్టర్‌ ద్వారా ఆస్పత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆమె ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడంపై ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టారు. ఎందుకు సోషల్‌ మీడియాలో పెట్టావంటూ మందలించారు. ఆ డాక్టర్‌ పోస్టు చేసిన మెడికల్‌ రిపోర్టును చూసిన డాక్టర్‌ లీ వెన్లీయాంగ్‌.. ఈ వైరస్‌ సార్స్‌ కంటే డేంజర్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసి ప్రజలను హెచ్చరించారు. ఆ తర్వాత ఆయనపై ఉన్నతాధికారులు కోపాన్ని చూపించారు. అవేవీ పట్టించుకోని డాక్టర్‌ లీ వెన్లీయాంగ్‌ ఎంతో మంది కరోనా బాధితులకు చికిత్స చేశాడు. చివరకు ఆ వైరసే సోకి మరణించాడు. ఆయనతో పాటు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ గురించి చైనా ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించిన మరో ముగ్గురు డాక్టర్లు కూడా కరోనా వైరస్‌ సోకి మృతి చెందారు. వైద్యుల హెచ్చరికలను అక్కడి ఉన్నతాధికారులు పట్టించుకుంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని తర్వాత తెలిసింది. పైగా కరోనా వైరస్‌.. అమెరికా సైనికుల నుంచి వచ్చిందంటూ చైనా ప్రభుత్వం దుష్ప్రచారం కూడా చేసింది.

తాజాగా ఈ వైరస్‌ గురించి ముందుగానే హెచ్చరించిన వారిలో ఒకరైన డాక్టర్‌ ఐ ఫెన్‌ను పీపుల్‌ మ్యాగ్‌జైన్‌ ఇంటర్య్వూ చేసింది. ఈ ఇంటర్య్యూలో ఆస్పత్రి అధికారులు తనను హెచ్చరించి విషయాలను ఆమె బయటపెట్టింది. అది ప్రచురితమైన మంగళవారం రోజు నుంచే ఆమె కనిపించకుండా పోయారు. డాక్టర్‌ ఐ ఫెన్‌ చివరిసారిగా స్కూటీపై వెళుతూ కనిపించారని తెలిసింది. ఆ ఇంటర్య్వూకి సంబంధించిన లింక్‌ కూడా ప్రస్తుతం కనిపించడం లేదు.

Next Story