ఎంతోమందికి ఆకలి తీరుస్తున్న రతన్ టాటా జీవిత చరిత్ర..

By రాణి  Published on  31 March 2020 7:04 AM GMT
ఎంతోమందికి ఆకలి తీరుస్తున్న రతన్ టాటా జీవిత చరిత్ర..

ముఖ్యాంశాలు

  • టాటా అంటే విలువలను పాటించే బ్రాండ్..
  • మంచి తనానికి మారుపేరు రతన్ టాటా
  • గర్వం లేని బిజినెస్ మ్యాన్
  • సింప్లిసిటీ ఆయన ఆభరణం

కరోనా పై పోరాటానికే కాదు..ఎంతోమందికి స్వచ్ఛంద సేవా సంస్థలు, టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో లక్షల వేలకోట్లు విరాళంగా ఇస్తున్న రతన్ టాటా జీవిత్ర చరిత్ర ఇది.

టాటా.. ఈ పేరు తెలియని వారుండరు. టాటా చేయని వ్యాపారమంటూ లేదు. ఉప్పు నుంచి ఉక్కు వరకూ, టీ నుంచి ట్రక్కు వరకూ ఎన్నో బిజినెస్ లు చేస్తున్నారు రతన్ టాటా. ఆయన పూర్తి పేరు రతన్ నవల్ టాటా. ఇండస్ట్రియలిస్ట్, ఇన్వెస్టర్, ఫిలాంత్రోపిస్ట్ గా బిజినెస్ రంగంలో రాణించి, కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించి, తనకంటూ చెరగని ముద్ర వేసిన రతన్ టాటా జీవితం గురించి మీకు తెలుసా ? ఎక్కడ చదివారు? బిజినెస్ రంగంలో ఎలా రాణించారు ? వ్యక్తిగత జీవిత విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రతన్ టాటా బాల్యం

నవల్ టాటా , సూని టాటా దంపతులకు 1937 డిసెంబర్ 28వ తేదీన సూరత్ లో జన్మించారు రతన్ నవల్ టాటా. ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయనకు 10 ఏళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో నానమ్మ వద్దే పెరిగారు. ముంబైలోని కాంపియన్ స్కూల్, క్యాత్ డ్రాల్ అండ్ జాన్ కేనన్ స్కూల్ లో టాటా స్కూల్ విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత న్యూయార్క్ ఇతాకాలోని కార్నెల్ యూనివర్శిటి లో అప్పర్ స్టడీస్ కొనసాగించారు. అదే యూనివర్శిటీలో బి.ఎస్ డిగ్రీ, ఆర్కిటెక్చర్ విత్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి అడ్వాన్స్ డ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాంలో మెళకువలు నేర్చుకున్నారు. ఇలా ఇంజినీరింగ్ పట్టా పొందగానే..ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జంషెడ్ జీ టాటా రతన్ టాటా ను ఇండియాకు వచ్చి స్టీల్ కంపెనీలో చేరమని కోరడంతో ఆయన ఇండియాకు వచ్చేశారు. ఆ కంపెనీలో అప్రెంటీస్ గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు అలా పనిచేశాక 1991లో జేఆర్డీ టాటా రతన్ టాటాను టాటా సంస్థకు చైర్మన్ ను చేశారు. కానీ అప్పుడున్న బొర్డు డైరెక్టర్లు టాటా ను చైర్మన్ ను చేయడం తప్పుపట్టారు. బిజినెస్ రంగంలో అనుభవం లేని రతన్ టాటాకు కోట్ల రూపాయల వ్యాపారాన్ని అప్పగించడం సరికాదని ఖండించారు. కానీ తన తెలివితేటలతో వాళ్లందరి అభిప్రాయం తప్పని నిరూపించారు. అప్పుడు రూ.10,000 కోట్లున్న వ్యాపారం ఇప్పుడు రూ.6 లక్షల కోట్లకు చేరింది.

150 ఏళ్ల చరిత్రకలిగిన టాటా గ్రూప్ ఎలా స్థాపితమైంది ? రతన్ టాటా తండ్రి, తాతయ్యల గురించి తెలుసుకుందాం. టాటా కంపెనీని రతన్ టాటా తాతయ్య జంషెడ్ జీ టాటా స్థాపించారు. 1868లో టాటా ఒక కాటన్ బిల్డింగ్ గా ప్రారంభమైంది. ఆయన తర్వాత వారసులు టాటా కంపెనీని నడిపిస్తూ వచ్చారు. మనదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ లైన్స్ ను ప్రారంభించింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్నఎయిర్ లైన్స్ మొదట టాటా ఎయిర్ లైన్స్ గానే ఉండేది. కానీ రెండో ప్రపంచ యుద్ధానంతరం అది ప్రభుత్వం తీసుకుంది. ఆసియాలోని మొట్టమొదటి స్టీల్ కంపెనీని, దేశంలో మొదటి హోటలైన్ తాజ్ హోటల్ ను స్థాపించింది కూడా టాటాలే. ఇలా మనదేశానికి టాటా వంశస్థులు కొత్తకొత్త బిజినెస్ లను పరిచయం చేశారు.

అందరికన్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది రతన్ టాటా గురించే. అంచెలంచెలుగా ఎదిగిన టాటా.. ప్రస్తుతం రూ. 6 లక్షల కోట్లతో 7 లక్షల మంది ఉద్యోగులతో నడిపిస్తున్న అతిపెద్ద కంపెనీకి చైర్మన్. దేశంలో ఇంత ఎక్కువమంది ఉద్యోగులతో నడుస్తున్న కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్. రిలయన్స్, ఆదిత్య బిర్లా వంటి కంపెనీలను కలిపినా టాటా కంపెనీకి ఏ మాత్రం సరిపోవు. టాటా కంపెనీ అంత పెద్దది. అంత పెద్ద కంపెనీకి చైర్మన్ గా ఉన్న టాటా ఏనాడు కూడా భారత దేశంలో గాని, ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుల లిస్ట్ లో ఎందుకు లేరో తెలుసా ? టాటా సంస్థకు వచ్చే లాభాల్లో 66 శాతాన్ని టాటా ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సేవలకే వెళ్లిపోతుంది. టాటా గ్రూప్ విలువ 6 లక్షల కోట్లైనప్పటికీ..ఆయనకున్న ఆస్తి విలువ రూ.5300 కోట్లే. ఒకవేళ టాటా ట్రస్ట్ కు ఆయన ఆస్తిలో ఏమీ ఇవ్వకపోతే ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో మొదటి ముగ్గురిలో టాటా కూడా ఒకరై ఉండేవారు.

కష్ట నష్టాలను చవిచూసిన టాటా

వ్యాపార ప్రయాణంలో టాటా ఎలాంటి అవరోధాలను, అవమానాలు ఎదుర్కోలేదనుకుంటే పొరపాటే. 1998లో రతన్ టాటా..టాటా ఇండికా కార్లను ఆవిష్కరించారు. ఆ కార్లు విడుదలైన మొదటి ఏడాదే ఫెయిల్ అయ్యాయి. దీంతో ఇండికా కార్లను అమ్మేయాలని కొంతమంది సలహాలివ్వడంతో..టాటా అమెరికాలోని ఫోర్డ్ సంస్థకు టాటా, బోర్డు సభ్యులు వెళ్లారు. అలా ఫోర్డ్ సంస్థతో జరిగిన మీటింగ్ కు ఛైర్మన్ కూడా వచ్చారు. ఆ మీటింగ్ లో ఫోర్డ్ చైర్మన్ టాటాను కించపరిచేలా మాట్లాడారు. కార్లు తయారు చేయడం రానప్పుడు ఎందుకు మొదలుపెట్టారు అని ఫోర్డ్ చైర్మన్ టాటా అండ్ టీమ్ ను అవమానపరిచారు. దీంతో రతన్ టాటా డీల్ కుదుర్చుకోకుండానే ముంబైకి తిరిగొచ్చేశారు. తర్వాత కొన్నేళ్లకు టాటా ఇండికా నష్టాల నుంచి కోలుకుని లాభాల బాటపట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లైన జాగ్వార్, ల్యాండ్ రోవర్ లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇది తెలుసుకున్న టాటా ఆ రెండు కార్ల కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేశారు. దీంతో అమెరికా నుంచి ముంబైకి వచ్చిన ఫోర్డ్ టీమ్ రూ.9,300 కోట్లకు జాగ్వార్, ల్యాండ్ రోవర్ అమ్మేసింది.

తన తెలివితేటలతో టాటా ఆ రెండు కార్ల కంపెనీలను లాభాలు గడించేలా చేశారు. ఎవరైతే తనను అవమానించారో వారే తన వద్దకొచ్చేటట్లు చేశారు. అంతేకాదు యూరప్ కు చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీను కొనుగోలు చేసి టాటా స్టీల్ లో కలిపేశారు. ఇంగ్లండ్ కు చెందిన టెట్లీ టీ ని టాటా టీలో కలపడంతో అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఇతర దేశాలకు చెందిన 22 కంపెనీలను తన సంస్థలో కలిపి టాటా ను ఇంటర్నేషనల్ బ్రాండ్ గా తీర్చిదిద్దారు.

పేద, మధ్యతరగతి వారికోసం టాటా నానో

మనమే కాదు..మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా బ్రతకాలన్న మనస్తత్వం రతన్ టాటాది. అందుకే ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం చేస్తుంటారు. ఇందుకు ఉదాహరణే టాటా నానో. ఒక రోజు కారులో టాటా కారులో వెళ్తుండగా వర్షంలో ఓ స్కూటర్ పై దంపతులు, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తుండటం చూశారు. వెంటనే పేద, మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా లక్ష రూపాయలకు ఒక కారును తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. తన ఆలోచనను సంస్థ సభ్యులతో చెప్పగానే నవ్వేశారు. లక్ష రూపాయల్లో కారును ఎలా తయారు చేయగలరంటూ నిరాశపరిచారు. వెటకారాలాడారు. అయినా ఆయన మాత్రం తన పట్టుదలను వీడలేదు. ఇంజినీర్లను పిలిపించి ఇదే విషయం చెప్పగా వాళ్లు కూడా లక్షరూపాయల్లో కారు తయారు చేయడం కష్టమన్నారు. టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేసిన టాటా..ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు రూపుదిద్దుకోవడానికి కారణమయ్యారు. ఇది చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపడింది. నానో కారు తయారీ వల్ల కొన్న వేల కోట్లు నష్టాలొస్తున్నప్పటికీ వాటి తయారీని ఆపలేదు టాటా. ఎందుకంటే అది ఆయన కలల కారు. ప్రతి పేదవాడు కారులో తిరగాలన్నదే ఆయన స్వప్నం.

2008లో ఉగ్రవాదులు దేశంలోనే మొదట నిర్మితమైన తాజ్ హోటల్ లో దాడి చేసినా తట్టుకున్నారు. ఇలా ఎన్నో నష్టాలను, కష్టాలను ఎదుర్కొన్నారు రతన్ టాటా. అంతే కాదు.. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఇందుకు కారణం కూడా ఉంది. అమెరికాలో చదువుకుంటున్న సమయంలో టాటా ఓ అమ్మాయి ప్రేమలో పడ్డారు. చదువు పూర్తయ్యాక తాతయ్య ఇండియాకు రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకొచ్చేందుకు సిద్ధపడింది కానీ..అప్పట్లో ఇండియా చైనా మధ్య యుద్ధం జరుగుతుండటంతో ఆమె రాలేదు. అమెరికాలోనే మరొక వ్యక్తిని పెళ్లాడిందని టాటా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత తనకు పెళ్లిమీద వ్యాపకమే లేదన్నారు. ఇప్పటికీ కూడా ఆయన మైండ్ చాలా చురుగ్గా ఉంటుంది. గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను, హెలికాఫ్టర్లను, సూపర్ ఫాస్ట్ కార్లను నడపడం టాటాకు ఉన్న హాబీ.

యువతపై నమ్మకంతో పెట్టుబడులు

యువతపై ఆయనకు అపారమైన నమ్మకం. అందుకే పే టీఎం, ఓలా, స్నాప్ డీల్, కార్ దేఖో, జియోమీ ఇలా 39 కి పైగా స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. తన కుటుంబం కోసమో, వేల కోట్ల ఆస్తులను కూడబెట్టడం కోసమో ఆయన వ్యాపారం చేయట్లేదు. తన వల్ల నలుగురూ ఆనందంగా ఉండాలన్నదే ఆయన కోరిక. కంపెనీ లాభాల్లో 50 శాతానికి పైగా సమాజసేవకు ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. దేశంలో మారుమూల ప్రాంతంలో ఉండే పిల్లలందరూ చదువుకోవడానికి టాటా ట్రస్ట్ స్కాలర్ షిప్పులిస్తోంది. 96 సంస్థలను నడుపుతున్నారు రతన్ టాటా. ఇంత పెద్ద పారిశ్రామిక వేత్తైనప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ కు ఉండే గర్వం ఆయనలో ఏ కోశానా కనిపించదు. అన్నింటికీ మించి టాటా అంటే విలువలను పాటించే ఒక బ్రాండ్. మంచితనంలో ఆయన అపర కుబేరుడు. ఈ విషయంలో రతన్ టాటాకు ఎవరూ సాటిలేరు. ఇప్పుడు కూడా కరోనా పై పోరాటానికి కూడా టాటా గ్రూప్ రూ.1500 కోట్లు ప్రకటించింది.

Next Story