పెట్టెలో ఉన్నంత వరకే మంచివాడిని..బయటకు వచ్చాక నేను కాలుతూ నీ జీవితాన్ని నాశనం చేస్తా..జాగ్రత్త

By సుభాష్  Published on  30 May 2020 7:35 PM GMT
పెట్టెలో ఉన్నంత వరకే మంచివాడిని..బయటకు వచ్చాక నేను కాలుతూ నీ జీవితాన్ని నాశనం చేస్తా..జాగ్రత్త

ముఖ్యాంశాలు

  • ఫ్యాషన్‌ మత్తులో యువత ధూమపానం

  • ధూమపానం వల్ల అనర్థాలు ఎన్నో..

  • ప్రాణాలు పోతున్నా.. పెడచెవిన పెడుతున్న పొగరాయుళ్లు

  • నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

పొగాకు ప్రాణాంతకం..! ఇది తెలిసీ చాలామంది ధూమపానానికి బానిసలవుతున్నారు. మానేద్దాం.. మానేద్దాం.. అనుకుంటూనే.. దానిని కొనసాగిస్తున్నవారెందరో..! పొగాకు తాగేవారితోపాటు.. వారి కుటుంబసభ్యులు, వారిచుట్టూ ఉన్నవారు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పొగతాగే అలవాటుకు సాధ్యమైనంత తొందరగా పొగబెట్టకపోతే.. అది చివరకు మన ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో చేసిన హెచ్చరిక. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యూస్‌ మీటర్‌ ప్రత్యేక కథనం.

అభిమాన హీరోను చూసో, స్నేహితుల ప్రోద్బలంతోనో, స్టయిల్‌గా ఉంటుందనో.. రెండు వేళ్ల నడుమ సిగరెట్‌ పెట్టుకొని దమ్ములాగుతున్నారు పొగరాయుళ్లు. మొదట్లో సరదాగానే మొదలుపెట్టి.. రోజులు గడుస్తున్నకొద్దీ పొగ దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారు. దగ్గు, దమ్ము, పంటి నొప్పి, గొంతునొప్పి, తలనొప్పి, జలుబు, సైనసైటిస్‌లాంటి చిన్నచిన్న సమస్యలతో మొదలై,.. క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులు నిండు జీవితాన్ని బలిచేసుకుంటున్నారు.

యువతకు ఫ్యాషన్‌గా మారిన ధూమపానం ..

పొగాకు వాడకం వివిధ రూపాల్లో జరుగుతోంది. ప్రధానంగా పొగ రూపంలో పీల్చి, వదలడం నేటి యువతకు ఫ్యాషన్‌గా మారింది. సిగరెట్‌, బీడీ, చుట్ట, హుక్కా పీల్చడం.. ఇలా ఇది ఏ రూపంలో ఉన్నా అంతిమంగా ప్రాణాంతకంగానే మారుతుంది. చాలా మంది తమ కాలేజీ రోజుల్లోనే ధూమపానానికి అలవాటు పడుతున్నట్లు పలు నివేదికలు తేల్చాయి. అందులోనూ ఫ్రెండ్స్‌ ప్రోద్బలంతోనే సిగరెట్‌ చేతపడుతున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సమాజంలో భవిష్యత్తు తరమైన యువత చెడుమార్గాల వైపు వెళుతున్నా.. తల్లిదండ్రులు, పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రపంచ దేశాల్లో స్మోకింగ్ లో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా… భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పొగతాగడం వల్ల టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా వస్తుండటంతో.. దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో జనవాసాల మధ్య ఇలా దమ్ముకొడితే దుమ్ము దులిపేందుకు సిద్దమయ్యారు. కొన్ని రోజులు చర్యలు బాగానే చర్యలు చేపట్టనా మళ్ల యథాస్థితికి వచ్చింది.

పొగ తాగే వ్యక్తికే కాదు. పీల్చే వారికి కూడా ప్రమాదకరమే..

ఇక పొగ తాగడం వల్ల పొగ తాగిన వ్యక్తికే కాదు.. ఆ పొగను పీల్చిన వాళ్లకు కూడా ప్రమాదకరమే. ఇలా జనాలు ఉన్న స్థలంలో పొగతాగేవారు చెలరేగిపోతుండటంతో.. హైదరాబాద్ పోలీసులు నివారణ చర్యలపై సీరియస్ గా దృష్టి సారించారు. ఎవరైనా నిషేధిత ప్రాంతాల్లో పొగతాగితే.. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి 200 రూపాయల ఫైన్ వేసి హెచ్చరిస్తారు. కౌన్సెలింగ్ ఇస్తారు. మళ్లీ వాళ్లు అలాగే ప్రవర్తిస్తే.. వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. దాని కోసం సిగిరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం 2003ని పటిష్టవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో నో స్మోకింగ్ పై అవగాహన సెంటర్లను నిర్వహిస్తున్నారు. అయితే ముందుగా వారిపై చర్యలు కఠినగానే అమలు చేసి తర్వాత నామ మాత్రంగా వదిలేయడంతో మళ్లీ పొగరాయుళ్లు ఎక్కడి పడితే అక్కడే పొగతాగుతూ కనిపిస్తున్నారు.

ఫ్యాషన్‌ మత్తులో యువత ధూమపానం

సిగెరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, బహిరంగంగా పొగతాడం నేరం..ఇలాంటి స్టేట్యుటరీ వార్నింగ్ లు ఎన్నివున్నా...ఈ మహమ్మారి బారిన పడినవారు..ఆ రక్కసి కోరనుంచి బయటపడ లేకపోతున్నారు. ఫ్యాషన్ మత్తులో యువత ధూమపానానికి అలవాటు పడితే.. అది ఊపిరితిత్తులతో ఆటలాడుకుంటుంది.. క్యాన్సర్ ను అంటగడుతుంది. పొగతాగుడు వ్యసనం..మనిషిని ఇలా పీల్చి పిప్పిచేసి..రోగగ్రస్థునిగా చేస్తుంటే...ఆ వ్యక్తి కుటుంబీకులు అనాథలుగా మారుతున్నారు. అందుకే...ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్..అనే సూత్రం ధూమపానం విషయంలో బాగా పాటించాల్సిన సూత్రం. పొగాకు ఏ రూపంలో వాడినా.. అది ప్రాణాంతకమే. స్మోకింగ్ తో పాటు... గుట్కా, జర్దా, పాన్ మసాలా ఇలా ఘన రూపంలోనూ వాడినా అది ఆరోగ్యానికి ముప్పే. అందుకే..పగాకు లాంటి పొగాకు విషయంలో అత్యంత్ అప్రమత్తంగా మెలగాల్సివుంది. దాని దరిదాపులకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి.

ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ, ఎంత మూల్యానికి? సినిమా మొదలయ్యే ప్రతిసారి వచ్చే అడ్వర్టైజ్‌మెంట్ ఇది. దీని అర్థం పొగాకుకు దూరంగా ఉండమని. కానీ పోగధీరులకు ఈ మాటలు పట్టవు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాలమరణాలకు పొగాకే రెండో కారణంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి మే 31న వరల్డ్‌నో టొబాకో డే ను నిర్వహిస్తోంది.

పొగాకు వాడకం ప్రపంచాన్ని కలవర పెడుతోంది. పొగాకు ఏ రూపంలో సేవించిన అది ప్రాణాంతకంగా తయారవుతుంది. కేవలం పోగ తాగేవారే కాదు, ఆ అలవాటులేని వారు కూడా పరోక్షంగా దీని ప్రభావాన పడుతున్నారు. పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే..ప్రతిఏటా 7 మిలియన్ల మంది పొగాకు వల్ల కలిగే వ్యాధులతో చనిపోతున్నారు. అటు పరోక్ష స్మోకింగ్ వల్ల లక్షలాది మంది మరణిస్తున్నారు. దీంతో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా ప్రాణాంతకంగా మారుతోంది.

వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది..

కానీ పోగారాయుళ్లకు ఈ విషయాలేమి పట్టవు. దీనికి తోడు మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ధూమపానాన్ని ఓ ఫ్యాషన్‌గా భావిస్తోంది. సిగరేట్లో ఏముంది? పొగాకే కదా! పైగా ఫిల్టర్ సిగరేట్! త్రాగితే ఏమవుతుంది? ... హాయిగా... తేలిపోయినట్లు ఉంటుందని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి సిగరేట్ పొగలో 4000 రకాల రసాయనాలుంటే అందులో 250 రకాలు విషపూరితమైనవే. 43 రకాలు క్యాన్సర్ కారకాలు. నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ , తారు, ఆర్శనిక్ , అన్ టోన్, డి.డి.టి., బెంజీన్, అమ్మోనియా, రేడాన్, ఫార్మాల్డిహైడ్ రసాయనాలు అందులో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటి కారణంగా 25 రకాలైన జబ్బులు సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిందంటే ధూమపాన తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. అదికాక గుండె జబ్బులతో చనిపోయే ప్రతి 5 మందిలో ఒకరు ధూమపాన ప్రియులే. అదికాక భారతదేశంలోని క్యాన్సర్ బాధితుల్లో మూడింట ఒకవంతు పొగధీరులే.

గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ..

దీనికి తోడు ఖైనీలు, గుట్కాలు, పాన్పరాగ్, ఇలా రకరకాల పేర్లతో పొగాకు ఉత్పత్తులు విరివిగా లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో అయితే వీటి వినియోగం మరింత ఎక్కువ. దీంతో పోగాకు వాడకంతో శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతేకాక ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లే ఎంఫసియా, క్రానిక్‌అబ్‌స్ట్రక్టివ్‌ఫల్మనరీ డిసీజ్‌లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న 'ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఐకరాజ్యసమితి. ప్రతి సంవత్సరం ఒక రోజు ఈ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు పొగ త్రాగడం వలన వచ్చే అనారొగ్యం గురించి తెలియజెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం.

Next Story