తోక లేని పిట్ట గూడుకు కొత్త అందాలు.. నేడు ప్రపంచ తపాలా దినోత్సవం

By సుభాష్  Published on  9 Oct 2020 11:21 AM IST
తోక లేని పిట్ట గూడుకు కొత్త అందాలు.. నేడు ప్రపంచ తపాలా దినోత్సవం

నేడు ప్రపంచ తపాలా దినోత్సవం

తోక లేని పిట్ట తొంబై ఆరు ఊర్లు తిరిగింది అని ఉత్తరాన్ని గురించి మన పెద్దలు చెప్పేవారు. అలాంటి ఉత్తరాల పోస్టల్ శాఖ మన జీవితంలో భాగమై సరి కొత్త అందాల తో మెరిసి పోతోంది. ఉత్తరం మనలోని అనేక భావాలకు చిహ్నం. మారు మూల ప్రాంతాలకు పోస్టల్ శాఖ తన సేవలను 1854లో ప్రారంభించింది. భారత దేశంలో రైల్వే శాఖ తరువాత రెండవ అతిపెద్ద వ్యవస్థ పోస్టల్ శాఖ. సెల్ ఫోన్ వచ్చిన తరువాత ఉత్తరాలు రాసే వారు తగ్గినా, కాలానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ సరి కొత్త అందాలతో మనకు మరింత దగ్గరై తన సేవలు మెరుగు పరచి విస్తరించింది. మొదట ఉత్తరాల వరకే సేవలు కొనసాగినప్పటికి, అనేక సేవలు కొత్తగా ప్రారంభించింది పోస్టల్ శాఖ. నేషనల్, ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్,స్పీడ్ నెట్,వారెంట్ పేమెంట్ స్కీం, ఈ పోస్ట్, డైరెక్ట్ పోస్ట్, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్, ఎటిఎం సేవలతో పాటు, మరెన్నో సేవలు పోస్టల్ శాఖ అందిస్తోంది. ప్రైవేట్ రంగంలో కొరియర్ సేవలు విస్తరించినా, పోస్టల్ శాఖపై ప్రజల ఆదరణ తగ్గలేదు. మిత్రుడి నుండి ఉత్తరం అందుకొని చదివితే ఎన్నో భావాలూ, మరెన్నో ఉద్వేగాలు. ఎంతో అనుభూతి. ఉత్తరం అది తీపి కబురు కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, బంధువుల మరణ వార్త కావచ్చు, అన్నీ భావొద్వేగాలే. పింఛన్ల పంపిణి చేపట్టిన పోస్టల్ శాఖ వృద్ధుల కళ్లల్లో ఆనందం నింపింది. సోషల్ మీడియా ,facebook whatsapp ఇలాంటివి వచ్చినా, పోస్టల్ శాఖ వన్నె తగ్గలేదు.

తపాలా శాఖ అందిస్తున్న సేవలు:

తపాలా శాఖ పొదుపు ఖాతా, ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు, సుకన్య సమృద్ది యోజన, మొబైల్‌ మనీ ట్రాన్స్‌ ఫర్‌, తపాలా జీవిత బీమా, పీఎం సురక్షా భీమా యోజన తదితర సేవలను అందిస్తోంది.

వారం రోజుల పాటు కార్యక్రమాలు:

తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది పోస్టల్‌ శాఖ. 9న ప్రపంచ తపాలా దినోత్సవం, 10న బ్యాంకింగ్‌ దినోత్సవం, 12న తపాలా జీవిత బీమా దినోత్సవం, 13న స్టాంపుల సేకరణ దినోత్సవం, 14న వ్యాపార అభివృద్ధి దినోత్సవం, 15న ఉత్తరాల బట్వాడా దినోత్సవం వంటివి వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

తపాలా రంగంలో మైలురాళ్ళు

♦ 1854 లో పోస్ట్ ఆఫీస్ చట్టం

♦ 1880 లో మనీ ఆర్డర్ సేవలు ప్రారంభం.

♦ 1986 లో నేషనల్ స్పీడ్ పోస్ట్ ప్రారంభం.

♦ 1994 లో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ సేవలు ప్రారంభం.

♦ 2004 లో ఈ పోస్ట్ ప్రారంభం.

♦ 2005 లో డైరెక్ట్ పోస్ట్ ప్రారంభం.

♦ 2008 లో ఎలక్ట్రానిక్ ఎం ఓ

♦ 2009 లో ఎటిఎం సేవలు

♦ 2011 పార్సెల్ సేవలు ప్రారంభం.

♦ 1850 లో ప్రారంభించిన టెలిగ్రామ్ సేవలు, జూలై 15 2013 న రద్దు చేసారు. మొదటి టెలిగ్రామ్ ను కలకత్తా నుండి డైమండ్ హార్బర్ కు పంపారు.

♦ 1972 లో ఆగష్టు 15 న భరత దేశంలో పిన్ కోడ్ వ్యవస్థ ప్రారంభం.

♦ ప్రపంచంలో మొదటి తపాలా బిళ్ళ బ్రిటన్ లో విడుదల అయింది.

♦ భారత దేశంలో మొదటి తపాలా బిళ్ళ 1852 లో కరాచీ లో విడుదల అయింది.దీని పేరు సింధ్ డాక్.

♦ భారత్ లో అత్యంత ఎత్తైన పోస్ట్ ఆఫీస్ హిమాచల్ ప్రదేశ్ లోని కాజా పోస్ట్ ఆఫీస్.ఇది సముద్ర మట్టానికి 4700 meeters ఎత్తులో ఉంది.

♦ భారత దేశం 100 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలో తొలి మహిళా తపాలా ఆఫీస్ ను ఢిల్లీ లో ప్రారంభించింది. ఇక్కడ పనిచేసేవారు అందరు మహిళలే. ఇలా తపాలా శాఖ ఎన్నోమైలురాళ్లు దాటుతూ ఇప్పటికి ఎన్నో సేవలు అందిస్తోంది.

Next Story