2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 8.8 బిలియన్లకు చేరుకుంటుందట..!
By సుభాష్
పారిస్: 2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 8.8 మిలియన్లకు చేరుకుంటుందని 'ది లాన్సెట్' జర్నల్ స్టడీలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో సంతానోత్పత్తి తగ్గిపోతుండడంతో ఈ శతాబ్ధం చివరకు చాలా వరకు దేశాల్లో జనాభా సగానికి సగం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ శతాబ్దం ముగిసే సమయానికి 195 దేశాల్లో 183 దేశాలలో జనాభా తగ్గనుందని రీసెర్చర్లు చెబుతూ ఉన్నారు. మరణాలు, సంతానోత్పత్తి, వలసలు వంటివి జనాభాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నాయి.
జపాన్, స్పెయిన్, ఇటలీ, థాయ్ లాండ్, పోర్చుగల్, సౌత్ కొరియా, పోలాండ్ లాంటి 20కి పైగా దేశాల్లో జనాభా సగానికి పైగా తగ్గనుంది. చైనాలో కూడా జనాభా భారీగా తగ్గనుందని అంటున్నారు. రాబోయే 80 సంవత్సరాల్లో 1.4 బిలియన్ల జనాభా నుండి చైనా జనాభా 730 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 2100నాటికి ఆఫ్రికాలో జనాభా మూడు రెట్లు పెరిగి 3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు.
మహిళల్లో సగటున జరగాల్సిన సంతాన ఉత్పత్తి జరగడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ సంతానోత్పత్తి 2.1 శాతం కన్నా తక్కువకు పడిపోతే అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జనాభా తగ్గుతుందని చెబుతున్నారు. 1950వ దశకంలో సగటున ప్రతి మహిళ తన జీవితకాలంలో 4.7 శాతం చొప్పున పిల్లల్ని కనేవారని, ప్రస్తుతం ఆ రేటు తగ్గింది.. 2017 సంవత్సరానికి సంతాన ఉత్పత్తి రేటు 2.4 శాతానికి పడిపోయినట్లు పరిశోధకులు వెల్లడించారు. 2100 వరకు సంతాన ఉత్పత్తి రేటు 1.7 శాతానికి పడిపోనున్నట్లు వారు అంచనా వేశారు. ఎక్కువ శాతం మహిళలు పిల్లల్ని కనేందుకు ఆడవాళ్లు ఆసక్తి చూపడంలేదన్నారు పరిశోధకులు.
భారత్ లో 2048 నాటికి 1.6 బిలియన్ల జనాభా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ 2100 నాటికి దాదాపు 32 శాతం జనాభా తగ్గడం వలన 1.09 బిలియన్ల జనాభా భారత్ లో ఉండనుంది. అప్పటికి కూడా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచే ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కు చెందిన రీసెర్చర్ల అంచనా ప్రకారం యువకుల-వృద్ధుల సంఖ్యల్లో కూడా భారీగా తేడాలు రాబోతున్నాయి. భారత్, చైనా దేశాల మీద ఇవి చాలా ప్రభావం చూపనున్నాయి.