IND Vs ENG: టీమిండియాకు షాక్.. రోహిత్‌శర్మకు గాయం

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. శనివారం ప్రాక్టీస్‌ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.

By Srikanth Gundamalla  Published on  29 Oct 2023 1:45 AM GMT
world cup-2023, india captain, rohit, injured,

IND Vs ENG: టీమిండియాకు షాక్.. రోహిత్‌శర్మకు గాయం

భారత్‌ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్‌ కప్‌-2023లో టీమిండియా జోరుమీద ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో ఆదివారం టీమిండియా తలపడనుంది. లక్నో వేదికగా ఇండియా, ఇంగ్లండ్‌ టీమ్‌లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. అయితే..ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. శనివారం ప్రాక్టీస్‌ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.

2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. కానీ.. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది భారత్. అందుకు అనుగుణంగానే టీమిండియా ప్లేయర్లు ముమ్మురంగా ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ మణికట్టుకు గాయమైనట్లు తెలిసింది. వేగంగా దూసుకువచ్చిన బంతి రోహిత్ కుడిచేతి మణికట్టును బలంగా తాకినట్లు సమాచారం. అయితే.. వెంటనే స్పందించిన ఫిజియోథెరపీ రోహిత్‌కు ట్రీట్‌మెంట్ చేశారట. మరి ఆగాయం తీవ్రత ఎంత వరకు ఉందో తెలియరాలేదు.

మరోవైపు రోహిత్‌కు అయిన గాయం తీవ్రతపై ఇప్పటి వరకూ బీసీసీఐ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. లక్నో వేదికగా జరిగే మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మను అనేక రికార్డులు ఊరిస్తున్నాయి . ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా గేల్ రికార్డును అధిగమించేందుకు రోహిత్ మరో పది సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఇదే సమయంలో ఆదివారం నాటి మ్యాచ్‌.. కెప్టెన్‌గా రోహిత్‌కు వందో మ్యాచ్ కానుంది. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు రోహిత్ 47 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్ మ్యాచ్‌‌లో హిట్ మ్యాన్ ఈ రికార్డులను అధిగమిస్తాడని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఈ సమయంలో రోహిత్ గాయపడ్డాడన్న వార్త అభిమానులను కలవరపెడుతోంది.

ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. అతడు దూరం కావడంతో తుది జట్టు కూర్పులో భారత్‌కు కాస్త ఇబ్బందులు వస్తూనే ఉన్నా విజయతీరాలకు మాత్రం చేరుకుంటున్నారు. కానీ.. కెప్టెన్ రోహిత్‌ శర్మ ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచుల్లో అద్భుత ఆరంభాన్ని ఇస్తూ భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలాంటి సమయంలో రోహిత్‌ గాయపడ్డాడన్న వార్త అభిమానులను కంగారుపెడుతోంది.

Next Story