World Cup-2023: IND Vs PAK.. నేడే హై వోల్టేజ్‌ మ్యాచ్‌

భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఇవాళే జరగనుంది. నరేంద్ర మోదీ మైదానంలో ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు అన్నీ సిద్ధం అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  14 Oct 2023 7:32 AM IST
World Cup-2023, Ind vs pak match, narendra modi stadium,

 World Cup-2023: IND Vs PAK.. నేడే హై వోల్టేజ్‌ మ్యాచ్‌ 

ఇండియా వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ప్రతిష్టాత్మక ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఇవాళే జరగనుంది. నరేంద్ర మోదీ మైదానంలో ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు అన్నీ సిద్ధం అయ్యాయి. దాదాపు లక్షా 30వేల ప్రేక్షకుల సామర్థ్యంతో అతిపెద్ద స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు రెడీ అయ్యింది. లక్షకు పైగా మంది ప్రేక్షకుల అల్లరి మధ్య భారత్ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ చూడటం ఓ అద్భుతం అనే చెప్పాలి. ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌ కప్‌లో తలపడ్డ ఏడుసార్లూ పాకిస్థాన్‌ను ఓడించిన ఘనత టీమిండియాకు ఉంది. దాంతో.. భారత్ ఈ మ్యాచ్‌లో అందరికీ ఫేవరెట్‌. అయితే.. పాకిస్థాన్‌ జట్టులోనూ కొందరు ప్రమాదకర ఆటగాళ్లు ఉన్నారు. ఎవరీ తక్కువ అంచనా వేయొద్దు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరింత ఊపునిచ్చే విషయం ఏంటి అంటే ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ డెంగీ జ్వరం నుంచి కోలుకోవడం. చైన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందిన అతను ఇప్పటికే డిశ్చార్‌ అయ్యాడు. ఆ తర్వాత జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో కూడా పాల్గొంటున్నాడు. అయితే.. గిల్‌ పాక్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటంపై రోహిత్‌శర్మ కూడా సానుకూలంగా మాట్లాడాడు. శుభ్‌మన్‌ గిల్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఆడేందుకు 99 శాతం అవకాశాలు ఉన్నాయన్నాడు. ఇప్పటి వరకు ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ తుది జట్టులో చోటు సంపాదించుకుని గ్రౌండ్‌లో దిగి దాన్ని కొనసాగిస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పాలి. గత మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌ కూడా చూశాం. అదే జోరును కొనసాగిస్తే మాత్రం టీమిండియాను ఏ బౌలరూ ఆపలేడు.

అయితే.. నరేంద్ర మోదీ స్టేడియంగా మారిన మొతెరా మైదానంలో పిచ్‌ స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. పునర్నిర్మాణం తర్వాత మరింతగా స్పిన్నర్లు ఈ ఈ మైదానంలో ప్రభావం చూపడం గమనించవచ్చు. వరల్డ్‌ కప్‌ ఆరంభ మ్యాచ్‌లోనూ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. అయితే.. అటు బ్యాటింగ్‌కు కూడా చెన్నైలో వంటి కష్టం ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ చెబుతోంది. వరుణుడు కరుణించి ఈ మ్యాచ్‌ సాఫీగా జరిగేందుకు అనుకూలిస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బౌలింగ్‌లో షహీన్‌ అఫ్రిది నుంచి భారత్‌కు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. ఆరంభ ఓవర్లలో అతణ్ని కాచుకోవడం సవాలే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన హారిస్‌ రవూఫ్‌తోనూ ప్రమాదమే. బ్యాటింగ్‌లో ఆ జట్టుకు రిజ్వాన్‌ అత్యంత కీలకం. బాబర్‌ అజామ్‌కు భారత్‌ మీద రికార్డు బాగా లేదు. ఇటీవల అతడి ఫామ్‌ కూడా బాగా లేదు. కానీ వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ అయిన బాబర్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

ఇక పాక్‌తో మ్యాచ్‌ అంటే భారత అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ మ్యాచ్‌లో బాగా ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తే మాత్రం అతడు హీరో అయిపోతాడు. గత మ్యాచుల్లో అలాగే జరిగింది. పాక్‌పై 1996, 1999లో వెంకటేశ్‌ ప్రసాద్‌ అద్భుత బౌలింగ్‌ను.. 2015లో కోహ్లి సెంచరీని.. 2019లో రోహిత్‌ భారీ శతకాన్ని అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలా ఇప్పుడు హీరో ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి, రోహిత్‌, రాహుల్‌లపై భారీ అంచనాలున్నాయి. బౌలింగ్‌లో కుల్‌దీప్‌, బుమ్రాలపై జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

తుదిజట్టు కూర్పుపై టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. జట్టులో ఒకట్రెండు మార్పులు చేయాల్సిన అవసరం వస్తే చేస్తామన్నాడు. పిచ్‌ను బట్టి అవసరం అనిపిస్తే ముగ్గురు స్పిన్నర్లతో దిగుతామన్నాడు. గత రెండు మ్యాచులకు ఎలా సన్నద్ధం అయ్యామో అలాగే ఈ పోరుకూ రెడీ అవుతున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

Next Story