భారత్‌పై స్వల్ప లక్ష్యమే కానీ.. అదే మమ్మల్ని ఓడించింది: బట్లర్
టీమిండియా చేతిలో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 1:05 PM ISTభారత్‌పై స్వల్ప లక్ష్యమే కానీ.. అదే మమ్మల్ని ఓడించింది: బట్లర్
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా మరో విజయం ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. డెఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఈ విజయం దక్కింది. అయితే.. టీమిండియా చేతిలో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. స్వల్ప లక్ష్యాన్ని సులువుగా చేదిస్తామని భావించామని.. కానీ పాత కథే పునరావృతం అయ్యిందని బట్లర్ విచారం వ్యక్తం చేశాడు.
వరల్డ్ కప్-2023లో ఇంగ్లండ్‌కు ఇది ఐదో ఓటమి. ఆరు మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఇంగ్లండ్ టీమ్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ .. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పారు. తమ బౌలర్లు ఆరంభం నుంచే వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారని ప్రశంసించాడు. కానీ బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలం అయ్యారని అసహనం వ్యక్తం చేశాడు. ఒక్క బ్యాటర్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో పరాజయం తప్పలేదని బట్లర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాను 229 పరుగులకే కట్టడి చేసినా.. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరిపోయారు.
ఇంగ్లండ్ ఓపెనర్లు బెయిర్‌స్టో 14), డేవిడ్ మలన్(16) నిరాశ పరచగా.. జో రూట్, బెన్ స్టోక్స్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఇద్దరు ‘స్టార్’ బ్యాటర్లు డకౌట్లుగా వెనుదిరగడంతో ఇంగ్లండ్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇక కెప్టెన్ జోస్ బట్లర్ సైతం కేవలం 10 పరుగులకే పరిమితం కాగా.. మొయిన్ అలీ 15 పరుగులు చేయగలిగాడు. ఏడో నంబర్ బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ 27 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయిన బట్లర్ బృందం మరో ఓటమిని మూటగట్టుకుంది.
జోస్ బట్లర్ చాంపియన్స్ ట్రోఫీ 2025 క్వాలిఫికేషన్ సిస్టమ్ గురించి కూడా స్పందించాడు. తమకు ఈ విషయం ముందే తెలుసన్న బట్లర్.. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఆడతామని చెప్పాడు. ఇంగ్లండ్ ఇంకా ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో గెలిస్తేనే పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలిచి చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకుంటుంది.