World Cup-2023: ఉత్కంఠ పోరులో కివీస్‌పై ఆస్ట్రేలియా విజయం
ధర్మశాల వేదికగా జరిగిన పోరులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 7:15 PM ISTWorld Cup-2023: ఉత్కంఠ పోరులో కివీస్‌పై ఆస్ట్రేలియా విజయం
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్-2023 కొనసాగుతోంది. ఇందులో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన పోరులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరకు వరకు ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో కివీస్‌పై 5 పరుగుల తేడాతో గెలిచింది ఆస్ట్రేలియా టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత చేధనకు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర (108; 82 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ వృథా అయింది. డారిల్ మిచెల్ కూడా బాగానే రాణించాడు. 51 బంతుల్లో 54 పరుగులు చేశారు. ఇక చివర్లో జేమ్స్ నీషమ్ 39 బంతుల్లో 58 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. అతడు దూకుడుగా ఆడినా టీమ్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. డేవాన్ కాన్వే (28), విల్ యంగ్ (32), టామ్ లేథమ్ (21), గ్లెన్ ఫిలిప్స్ (12), మిచెల్ శాంట్నర్ (17) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3, హేజిల్‌వుడ్ 2, కమిన్స్ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ 67 బంతుల్లో 109 పరుగులు చేశారు. ఇతడు ఏకంగా 7 సిక్సర్లు బాదాడు. కేవలం 59 బంతుల్లోనే శతకం బాది ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు ట్రావిస్ హెడ్. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు.. నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కడంతో భారీ స్కోరుని నిర్దేశించింది. మొదటి వికెట్‌కు 175 పరుగులు జోడించారు. అయితే, కివీస్ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూకుడుగా ఆడారు. మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో 41 పరుగులు చేయగా.. కమిన్స్ 14 బంతుల్లో 37 రన్స్ చేశాడు. ఇంగ్లిస్ (38), మిచెల్ మార్ష్ (36) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, గ్లెన్ ఫిలిప్స్ 3, మిచెల్ శాంట్నర్ 2.. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ తీశారు.