World Cup-2023: లక్నో స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం (వీడియో)

లక్నో స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో హోర్డింగ్‌ కుప్పకూలింది.

By Srikanth Gundamalla
Published on : 17 Oct 2023 10:48 AM IST

world cup-2023, AUS Vs SL, hoarding collapse,  lucknow stadium,

World Cup-2023: లక్నో స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం (వీడియో)

భారత్ వేదికగా వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ కొనసాగుతోంది. అయితే.. సోమవారం లక్నో స్టేడియం వేదికంగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. భారీ గాలులకు స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనతో ప్రేక్షకులతో పాటు ఆటగాల్లు ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొదట శ్రీలంక బ్యాటింగ్ చేసింది. అయితే.. 32 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం పడింది. దాంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వర్షం కురుస్తున్న సమయంలో స్టేడియంలో భారీ ఈదురుగాలులు వీచాయి. దుమ్ము రేగి ప్లేయర్లు.. ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో గాలులు బాగా వేగంగా వీడయం ద్వారా పైకప్పు చివరలో ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్ ఒక్కసారిగా విరిగి కింద పడింది. అయితే.. హోర్డింగ్‌ పడిన ప్రదేశంలో తక్కువ మంది ప్రేక్షకులు ఉండటం.. అంతేకాక వారు ఆ ప్రమాదాన్ని గమనించి ముందుగానే పక్కకు జరగడం ద్వారా పెనుప్రమాదం తప్పినట్లు అయ్యింది.

ఈ ఘటనపై ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్‌ జంపా స్పందించాడు. స్టేడియంలో ఒక హోర్డింగ్‌ కూలడం తానెప్పుడూ స్వయంగా చూడలేదన్నాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆశిస్తున్నట్లు చెప్పాడు. కాగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన జంపా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా.. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక లక్నో స్టేడియంలో షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 29న భారత్‌-ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి.

Next Story