ఇవాళ రెండు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు.. ఎవరు గెలిస్తే ఏమవుతుంది..?
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం ఆసక్తికర మ్యాచ్‌లు జరగబోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 4:15 AM GMTఇవాళ రెండు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు.. ఎవరు గెలిస్తే ఏమవుతుంది..?
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం ఆసక్తికర మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఇప్పటికే 7 వరుస విజయాలతో సెమీస్ బెర్త్‌ను టీమిండియా ఖరారు చేసుకుంది. ఇక సెమీస్ అవకాశాలపై ఇతర టీమ్‌లు దృష్టి సారించాయి. ఆ అవకాశాలను మెరుగుపరుచుకునే దిశగా అయిదో విజయంపై రెండు జట్లు కీలక పోరాటాలకు సిద్ధం అయ్యాయి. 6 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచిన ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌తో ఇవాళ మ్యాచ్ ఆడనుంది. ఇక ఏడు మ్యాచులు ఆడి నాలుగింటిలో విజయం సాధించిన న్యూజిలాండ్... పాకిస్తాన్‌తో తలపడబోతుంది.
అయితే.. చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో వెలువడే ఫలితం సెమీఫైనల్ బెర్తులను ఉత్కంఠగా మార్చనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలుంటాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడాక బలంగా పుంజుకుని వరుసగా నాలుగు విజయాలు సాధించిన ఆసీస్.. సెమీస్ దిశగా దూసుకెళ్తోంది. అయితే గాయంతో మ్యాక్స్‌వెల్, వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ దూరం కావడం ఆ జట్టును దెబ్బ తీసేదే. మరోవైపు 6 మ్యాచ్‌ల్లో 5 ఓడి దాదాపుగా సెమీస్‌కు దూరమైన ఇంగ్లాండ్ పరువు కోసం పోరాడనుంది. ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌కు ఎలాగూ సెమీస్ చేరే అవకాశం లేదు. దాంతో.. చిరకాల ప్రత్యర్థి కాబట్టి ఇంగ్లండ్ తెగించి ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక మరోవైపు నాలుగు వరుస విజయాలతో టోర్నీని ఘనంగా ఆరంభించిన కివీస్.. తర్వాతి హ్యాట్రిక్ ఓటములతో ఇబ్బందుల్లో పడింది. ఇవాళ జరిగే మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ ఢీకొట్టనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. లేదంటే అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారతాయి. విలియమ్సన్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచే ఆడగా.. పేసర్ హెన్రీ గాయంతో మిగతా టోర్నీకి దూరం కావడం ఆ టీమ్‌కు షాకింగ్ విషయమే. ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ మూడు విజయాలతో ఆరో స్థానంలో ఉంది. దాంతో సెమీస్ అవకాశాలు తక్కువగానే ఉన్నా.. ఆ జట్టు ఆశతోనే ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవాళ జరిగే మ్యాచుల్లో గెలిస్తే పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ఒకేసారి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. కాబట్టి శనివారం జరిగే రెండు మ్యాచ్‌లపై ఆసక్తి నెలకొంది.