సచిన్, విరాట్ సైతం వెనక్కి.. అప్ఘన్ బ్యాటర్ సరికొత్త రికార్డు
అప్ఘానిస్తాన్ బ్యాటర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 3:00 PM GMTసచిన్, విరాట్ సైతం వెనక్కి.. అప్ఘన్ బ్యాటర్ సరికొత్త రికార్డు
భారత్ వేదికగా సాగుతోన్న వరల్డ్ కప్ సెమీస్ దశకు చేరుకుంటోంది. ఈ టోర్నీలో ఒక్క అపజయం లేని టీమ్‌గా భారత్ నిలిచింది. అయితే.. ఈ టోర్నీలో ఇండియా ప్లేయర్లే కాదు.. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు రికార్డులను క్రియేట్ చేశారు. తాజాగా అప్ఘానిస్తాన్ బ్యాటర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ కప్ చరిత్రలో అప్ఘానిస్తాన్ తరఫున శతకం బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్రకు ఎక్కాడు.
వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీలో భాగంగా అప్ఘానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఈ రికార్డుని క్రియేట్ చేశాడు. మంగళవారం మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో అప్ఘానిస్తాన్ టీమ్ తలపడుతోంది. ఈమ్యాచ్‌లోనే ఓపెనర్‌గా వచ్చిన ఇబ్రహీం జద్రాన్ గుర్తుండిపోయే ఇన్నింగ్ ఆడాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఈ మ్యాచ్‌ల జరిగింది. మొత్తం 143 బాల్స్‌ను ఎదుర్కొన్న ఇబ్రహీం.. 129 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు.. 3 సిక్సర్లు బాదాడు ఇబ్రహీం జద్రాన్. వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత తక్కువ వయసులో సెంచరీ బాదిన వారి లిస్ట్‌లోనూ చేరిపోయాడు ఈ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. ఈ లిస్టులో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సైతం వెనక్కి నెట్టేశాడు.
అత్యంత తక్కువ వయసులో వన్డే వరల్డ్ కప్‌లో శతకాలు కొట్టిన వారు:
* 20 ఏళ్ల 196 రోజులు - పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్) నెదర్లాండ్స్ మీద- 2011లో కోల్‌కతాలో
* 21 ఏళ్ల 76 రోజులు- రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా) వెస్టిండీస్ మీద- 1996లో జైపూర్‌లో .
* 21 ఏళ్ల 87 రోజులు- అవిష్క ఫెర్నాండో(శ్రీలంక) వెస్టిండీస్ మీద- 2019లో ఛెస్టెర్ లీ స్ట్రీట్‌లో
* 21 ఏళ్ల 330 రోజులు- ఇబ్రహీం జద్రాన్(అప్ఘానిస్తాన్) ఆస్ట్రేలియా మీద- ముంబైలో-2023లో
* 22 ఏళ్ల 106 రోజులు- విరాట్ కోహ్లి(ఇండియా) బంగ్లాదేశ్ మీద- మీర్పూర్- 2011లో
* 22 ఏళ్ల 300 రోజులు- సచిన్ టెండుల్కర్(ఇండియా)- కెన్యా మీద- కటక్‌లో- 1996లో
కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అప్ఘానిస్తాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ ఇబ్రహీం సూపర్ ఇన్నింగ్స్ ఆడటం మిగతావారు రాణించడంతో.. 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.