రోహిత్, కోహ్లీ ఏమో కానీ.. అతను మాత్రం మళ్లీ అదరగొడతాడు: గంభీర్
వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ చివరి అంకానికి చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 11:32 AM ISTరోహిత్, కోహ్లీ ఏమో కానీ.. అతను మాత్రం మళ్లీ అదరగొడతాడు: గంభీర్
వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు చేరిన టీమిండియా బలంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ వరల్డ్ కప్‌లో తొలుత కాస్త తడబడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా గెలుస్తూ ఫైనల్ వరకు చేరింది. ఈ హైటెన్షన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. ఆసీస్‌ను చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే అహ్మాదాబాద్‌కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.
ఈ టోర్నీలో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదంటే.. ఫామ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు ఓపెనర్లు.. మిడిలార్డర్ అందరూ తమ వంతుగా పరుగులు చేస్తూ భారత్ గెలుపులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యార్‌పై భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆసీస్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ మరోసారి అదరగొడతాడని జోస్యం చెప్పాడు. గత రెండు మ్యాచుల్లో అయ్యర్ సెంచరీల గురించి ప్రస్తావించారు గంభీర్. సెమీఫైనల్‌లో అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ నమోదు చేశాడని చెప్పారు. మరోసారి ఆస్ట్రేలియాపై కూడా అద్భుత ప్రదర్శన ఇస్తాడని గౌతం గంభీర్ అన్నారు.
ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో తన వరకు అయితే శ్రేయాస్ అయ్యర్ బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్ అని గంభీర్ అన్నారు. అతడు ఈ టోర్నీకి ముందు గాయంతో బాధపడ్డాడనీ.. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఈ తరహా ప్రదర్శన చేయడం అంత ఈజీకాదని చెప్పారు. న్యూజిలాండ్ వంటి జట్టుపై సెమీఫైనల్లో కేవలం 70 బంతుల్లో సెంచరీ చేయడం అయ్యర్‌కే సాధ్యమైందన్నారు గంభీర్. ఆసీస్‌తో ఫైనల్లో మరోసారి తన మార్క్‌ను చూపిస్తాడని భావిస్తున్నానని గంభీర్ అన్నారు. మిడిల్ ఓవర్లలో జంపా, మాక్స్‌వెల్‌ను ధీటుగా అయ్యర్ ఎదుర్కొంటాడని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు.
ఓవరాల్‌గా ఈ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ 10 మ్యాచ్‌లు ఆడి.. 75.14 సగటుతో 526 పరుగులు చేశాడు. మరోవైపు ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 10 మ్యాచ్‌లు ఆడి 711 పరుగులు చేశాడు.