వృద్ధాప్యం మరో పసితనం లాంటిది.. నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం

By సుభాష్  Published on  1 Oct 2020 5:31 AM GMT
వృద్ధాప్యం మరో పసితనం లాంటిది.. నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం

పిల్లల చిటికెన వేలు పట్టుకుని నడకను నేర్పి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు. కష్టాలకోర్చి వారికి చదువు సంధ్యలు నేర్పించి పిల్లల భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు శక్తినంతా ధారపోస్తారు. అలాంటి వారిని బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం పిల్లలపై ఎంతైనా ఉంది. అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా 'న్యూస్‌మీటర్‌' ఈ కథనం.

కొమ్మకు పూసిన పూలు వాడక మానవు, చెట్టు కాసినకాయలు పళ్లయిఫలక మానవు. అలాగే పుట్టిన మనిషికి వృద్ధాప్యం రాక మానదు. ఇదంతా సృష్టి ధర్మం. పుట్టుక, పసితనం, యవ్వనం, పెళ్లి, పిల్లలు, వృద్ధాప్యం, మరణం ఇదే జీవిత చక్రం. జీవనసత్యం, పిల్లల్నికని, కంటికి రెప్పగా, ఊపిరిలో ఊపిరిగా చూసుకుంటూ పెంచి వాళ్లు ప్రయోజకులవ్వాలని రక్తమాంసాలు, ఆస్తిపాస్తులు కర్పూరంలా కరిగినా లెక్కచేయక, బిడ్డల కోసమే ముసురుతున్న వృద్ధాప్యపు ఛాయల్ని కనిపెట్టని తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు.

వృద్ధాప్యం మరో పసితనం లాంటిది

వృద్ధాప్యం మరో పసితనం లాంటిది. చిన్న పలకరింపును కోరుకునే వయసు వారిది. ఆత్మీయుల ఎంతగానో ఎదురుచూపులు చూసే మనసు వారిది. ఈరోజుల్లో ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. ప్రేమ, ఆత్మీయత ల్లేని సంసారాల వల్ల, ఉద్యోగాల పేరిట దూరమైపోయిన కోడుకు- కోడళ్ల వల్ల గృహసంబంధమైన వివాదాల వల్ల దూరంగా ఉంటున్నారు. కారణమేదైనా ఫలితం మాత్రం పండుటాకులైన తల్లిదండ్రుల మీద పడుతోంది. మలిసంధ్యకు చేరుకున్న వృద్ధుల కోసం ఏ దిక్కు లేని వారి కోసం ప్రైవేటు సంస్థలు ఓల్డేజ్‌ హోమ్‌లు, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు నర్సింగ్‌ ఓల్డేజ్‌ హోమ్‌లు సైతం అందుబాటులో ఉంటున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయినా ఏం లాభం అమ్మా! అన్న పిలుపుకోసం ! ‘నాన్నా!’ అన్న పలకరింపు కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

ఉద్యోగాల వేటలో..

ఉద్యోగాల వేటలో వేల కిలోమీటర్ల దూరంలో, వీలైతే విదేశాలకు వెళ్లే పిల్లలు తమ మధ్య తల్లిదండ్రులను తీసుకు వెళ్లే పరిస్థితులు లేకుండా పోతోంది. వృద్ధాప్యం వచ్చాక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతోంది. ఎందరో తమ తల్లిదండ్రులు వృద్ధులయ్యాక వారిని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. దీంతో వారు ఆశ్రమాల్లోనే జీవితం గడిచిపోతోంది. ఇప్పటికైనా వృద్ధులను ఆశ్రమంలో చేర్పించకుండా మన మధ్యే ఉంచుకుని వారి బాగోగులు చూసుకోవాలని కోరుకుందాం.

Next Story