భారత్‌ నుంచి వెళ్లి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారంటే ఇక్కడి వారికి గొప్పగా కనిపిస్తారు. దీంతో అమ్మాయిల తల్లిదండ్రులుసైతం తమ బిడ్డలను విదేశాల్లో స్థిరపడిన వ్యక్తికి ఇస్తే భవిష్యతు బాగుంటుందని ఆశపడుతుంటారు. అవకాశం వస్తే తమ పిల్లలను విదేశాల్లో స్థిరపడిన వ్యక్తికి ఇచ్చి వివాహాలు జరిపిస్తుంటారు. అంతవరకు బాగున్నా.. కొందరు విదేశీ అల్లుళ్ల చేష్టలతో వారిని వివాహమాడిన అమ్మాయిల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. వివాహం చేసుకుని తీసుకెళ్లని అల్లుళ్లు కొందరైతే.. అక్కడకు వెళ్లాక కట్నం కోసం మానసికంగా వేధించడం, శారీరకంగా హింసిస్తూ కొందరు విదేశీ అల్లుళ్లు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది తెలిసి అమ్మాయిల తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్ల వైపు న్యాయం కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో విదేశాల్లో ఉన్న వారిపై చర్యలు తీఐసుకొనేందుకు,  అరెస్టు చేసేందుకు ఇక్కడి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.

ఇక వారి ఆటలు సాగవ్‌..

పెండ్లి చేసుకున్న అమ్మాయిలను మోసాలు చేయటం, వేధింపులకు గురిచేయటం చేస్తున్న విదేశీ ఆల్లుళ్ల ఆటలకు ఇక చెక్‌పడనుంది. ఇందుకు అనుగుణంగా సీసీఎస్‌ అధికారులు పకడ్బందీగా ముందుకెళ్లనున్నారు. ఈ కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయిన వారి పాస్‌పోర్ట్స్‌ రద్దు చేసేందుకు సీసీఎస్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయాలకు (ఆర్పీఓ) లేఖలు రాయడం ద్వారా వేధింపులకు పాల్పడే అల్లుళ్లకు చుక్కలు చూపించనున్నారు. సీసీఎస్‌ అధికారుల ఇప్పటికే 40మందిపై చర్యలు తీసుకోగా.. వారు హుటాహుటిన వచ్చి కేసు రాజీకుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.

ఇలా ముందుకెళ్తున్నారు..

కొందరు ఎన్నారై అల్లుళ్ల చేష్టలతో పెండ్లి చేసుకొని విదేశాల్లో భర్తతో హాయిగా జీవితాన్ని సాగిద్దామనుకున్న అమ్మాయిల జీవితాలు దిక్కుతోచని స్థితిలోపడిపోతున్నాయి. ఇందుకు కారణమవుతున్న ఎన్నారై అల్లుళ్లకు సీసీఎస్‌ అధికారులు షాక్‌ ఇస్తున్నారు. పాస్‌పోర్ట్‌ చట్టాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన అధికారులు.. చట్టంలోని కొన్ని సెక్షన్లను ఆసరాగా చేసుకొని వాటెండ్‌గా ఉండే ఎన్నారై అల్లుళ్ల భరతం పడుతున్నారు. విదేశాల్లో తలదాచుకున్న వ్యక్తి పాస్‌పోర్ట్ ను రద్దు చేయించే అధికారం పోలీసులకు ఉంది. అలా చేస్తూ ఆర్పీఓలకు లేఖలు రాయాలంటే అతడిపై న్యాయస్థానం ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా కేసుల దర్యాప్తు పూర్తి చేసుకున్న అధికారులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీటి ఆధారంగా ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయించి, ఆర్పీఓలకు లేఖ రాస్తున్నారు. విదేశీ మంత్రిత్వ శాఖ ద్వారా నిందితుడు ఉన్న దేశంలోని రాయబార కార్యాలయానికి సందేశం ఇస్తున్న ఆర్పీఓ.. పాస్‌పోర్ట్‌ రద్దుపై అతడికి నోటీసులు జారీ చేస్తోంది. ఎల్‌ఓసీ జారీ అయిన వ్యక్తి వ్యక్తిగత, కేసు వివరాలతో పాటు పాస్‌పోర్ట్‌ నంబర్లను విమానాశ్రయాల్లో ఉండే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తమ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసుకుంటారు. అతడు విమానం దిగిన  వెంటనే జరిగే ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల్లో వాంటెడ్‌ అని వెలుగులోకి రావడంతోనే అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీసులకు సమాచారం ఇస్తారు. ఆ పోలీసులు వచ్చి నిందితుడిని తీసుకువెళ్లే వరకు ఎయిర్‌పోర్ట్‌ దాటకుండా తమ అధీనంలోనే ఉంచుకుంటారు. అదే జరిగితే ఉద్యోగం కోల్పోవడంతో పాటు స్వదేశానికి డిపోర్ట్‌ కావడం, తిరిగి విదేశాలకు వచ్చే అవకాశాలు సన్నగిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో విషయం తెలుసుకొని వాటెండ్‌ ఎన్నారై అల్లుళ్లు విదేశాల నుంచి స్వదేశానికి వాలిపోతున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు భార్యలతో రాజీలు చేసుకోవడమో, కోర్టులకు హాజరై ఎన్‌బీడబ్ల్యూలు రీకాల్‌ చేయించుకోవడమో చేస్తున్నారు.

గతంలోఇంటర్‌ పోలే మార్గం..

ఒకప్పుడు 498 (ఎ) తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎన్నారైలను అరెస్టు చేసేందుకు సీఐడీ ద్వారా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాల్సిందే. ఆ సంస్థ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించి, ఆయా దేశాల్లో ఉన్న పోలీసులు పట్టుకునేలా చేసి ఇక్కడకు తీసుకువచ్చేవారు. భారత్‌లో మాదిరిగా అన్ని దేశాల్లోనూ వరకట్న వేధింపులు అనేది తీవ్రమైన నేరం కాకపోవటంతో కొన్నేళ్ల క్రితం నుంచి ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసుల జారీ ఆపేసింది. వీటి స్థానంలో బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేస్తూ.. కేవలం నిందితులకు సంబంధించిన ఆచూకీ తెలిపేందుకు మాత్రమే పరిమితమైంది. ఈ రకంగా వారి ఆచూకీ తెలిసినా.. ఇక్కడి పోలీసులు వెళ్లి తీసుకురావడం అసాధ్యమైంది. ఇది వాంటెడ్‌గా ఉన్న ఎన్నారై అల్లుళ్లకు బాగా కలిసి వచ్చే అంశంగా మారింది. ఇది ఒక తంతు అయితే.. ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్, బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేయించడం అంత సులువు కాదు. ఇందులో సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. స్థానిక పోలీసులు నేరుగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించలేరు. నోడల్‌ ఏజెన్సీగా పని చేసే సీఐడీ వంటి వ్యవస్థల ద్వారా వెళ్లాలి. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ కావడంతో ఇటీవల కాలంలో పోలీసులు వాంటెడ్‌గా ఉన్న ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లపై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.