యువతి ఆత్మహత్యకు కారణమైన అన్నయ్య ప్రేమ..!

By రాణి  Published on  12 Dec 2019 12:45 PM GMT
యువతి ఆత్మహత్యకు కారణమైన అన్నయ్య ప్రేమ..!

బెంగళూరు : వరసకు అన్నయ్య అయ్యే అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఏం జరిగిందో ఏమో అతను ప్రేమలో విఫలమయ్యాడు. ఆ అమ్మాయిని మరచిపోలేక మదనపడ్డాడు. ఫలితంగా అతని ప్రేమ వ్యవహారం యువతి ఆత్మహత్యకు కారణమయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బెంగళూరులోని వివేకనగర్ రుద్రప్ప గార్డెన్‌కు చెందిన యువతి తల్లిదండ్రులతో కలిసి నివాసముంటుంది. అదే వీధిలో వారికి కుటుంబానికి బంధువులైన వారు కూడా నివాసముంటున్నారు. ఆమెకు అన్నయ్య వరుసయ్యే సంజయ్ ప్రేమలో విఫలమై, బాధతో ఒత్తిడి గురయ్యాడు. అతడిని తిరిగి మామూలు మనిషిగా మార్చేందుకు ఆ కుటుంబం సాయశక్తులా ప్రయత్నించింది.

ఈ నేపథ్యంలో అన్నయ్యను పలుకరించేందుకు యువతి ఈనెల 2వ తేదీన వారి ఇంటికి వెళ్లింది. ప్రియురాలిని మరిచిపోలేక అతను పడుతున్న బాధను చూసి తట్టుకోలేక, అతనిని మార్చేందుకు ఆమె కొన్ని మాటలు చెప్పింది. '' నువ్వు ప్రేమించిన అమ్మాయి మంచిది కాదు. ఆమెకు చాలామంది అబ్బాయిలతో సంబంధాలున్నాయి. నీకు ఆమె తగిన వ్యక్తి కాదు'' అని యువతి తన అన్నకు చెప్పిన మాటలు ఆ నోట ఈ నోట చేరి అదే వీధిలో ఉంటున్న సంజయ్ మాజీ ప్రియురాలికి అక్క వరుసయ్యే ఇద్దరమ్మాయిల చెవికెక్కాయి. అంతే...ఆ ఇద్దరు యువతి తల్లి ముందే తిట్ల పురాణం అందుకున్నారు. ఇది రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేగేంత దూరం వెళ్లడంతో తనను దూషించిన వారిపై కేసు పెట్టేందుకు యువతి వివేకనగర్ పీఎస్ కు వెళ్లింది. అప్పటికే వైరి వర్గం అదే పీఎస్ లో యువతిపై, ఆమె కుటుంబంపై ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోరని, తమకు న్యాయం జరగదని భావించిన యువతి ఇంటికి వెళ్లి బీపీ టాబ్లెట్లను మింగేసింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. యువతి మింగిన టాబ్లెట్లను డాక్టర్లు కక్కించే ప్రయత్నం చేసి, ఐసీయూ చికిత్సనందించినప్పటికీ ఆమె మింగిన మాత్రలు త్వరగా ప్రభావం చూపడంతో చనిపోయింది. ఊహించని విధంగా ఆమె జీవితం అక్కడితో ముగిసిపోయింది. ఇలా అన్న ప్రేమ చెల్లెలి ఆత్మహత్యకు కారణమయింది.

Next Story
Share it