మీడియా ప్రతినిధుల ప్రవర్తనపై భగ్గుమన్న మహిళా పోలీస్ అధికారులు

By రాణి  Published on  22 Jan 2020 7:11 PM IST
మీడియా ప్రతినిధుల ప్రవర్తనపై భగ్గుమన్న మహిళా పోలీస్ అధికారులు

ఒక పక్క రాజధాని నిరసన సెగలు. మందడం, తుళ్లూరు..ఇలా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అల్లర్లు, గొడవలు, నిరసనలు, ఆందోళనలు. మరొక పక్క అసెంబ్లీ సమావేశాలు, శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణపై రసాభాస. వాటన్నింటినీ మీడియా కెమెరాల్లో బంధించాలి. సందులో సందు అనుకున్నారేమో వివిధ మీడియా సంస్థలకు చెందిన కెమెరామెన్లు, రిపోర్టర్లు...జర్నలిజానికే మాయని మచ్చతెచ్చేలా ప్రవర్తించారు.

ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల మాటల్లో చెప్పలేనంత అసభ్యకరంగా వ్యవహరించారు. అమరావతికి సమీపంలో ఉన్న మందడం గ్రామంలోని ఒక హై స్కూల్ లో మహిళా కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుంగా మీడియా కెమెరాలు వీడియో చిత్రీకరించాయి. మహిళల పట్ల కనీస మర్యాద కూడా పాటించలేదు సదరు కెమెరామెన్లు. తనపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించారని తెలుసుకున్న మహిళా కానిస్టేబుల్ జరిగిన ఘటనపై తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మికి ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధుల నిమిత్తం మందడంకు వచ్చిన తాను విధులు ముగించుకుని తమకు కేటాయించిన గదిలోకి వెళ్లామన్నారు. గదిలో దుస్తులు మార్చుకుంటుండగా కొన్ని ఛానెళ్ల సిబ్బంది ఆ గది కిటికీల నుంచి రహస్య వీడియో రికార్డు చేసినట్లు బాధిత మహిళా కానిస్టేబుల్ వెల్లడించింది. తమకు కేటాయించిన గదులలోకి తమ అనుమతి లేకుండా అసభ్యకరమైన వీడియోలు తీయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారందరిపైనా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఎవ్వరినీ వదిలేది లేదు

ఈ ఘటనపై డీఎస్పీ శ్రీలక్ష్మి, సీఐడీ అడిషినల్ ఎస్పీ సరిత, విశాఖ మహిళా డీఎస్పీ ప్రేమ్ కాజల్ స్పందించారు. మహిళలకు భద్రత కల్పించాలని తమ ఛానెళ్లలో ప్రసారం చేసుకునే మీడియా సంస్థలకు చెందిన వారే ఇలాంటి ఘటనలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. డీఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ..అసెంబ్లీ వద్ద విధులు నిర్వర్తించేందుకు డ్యూటీ పై వచ్చిన మహిళా పోలీసులకు మందడంలోని జడ్పీ హై స్కూల్ వద్ద వసతి కల్పించామన్నారు. విధులు ముగించుకుని గదిలో దుస్తులు మార్చుకుంటున్న మహిళా కానిస్టేబుల్ ను ఫొటోలు, వీడియోలు తీయడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఉన్న ఆధారాల మేరకు ముగ్గురు కెమెరామెన్లపై నిర్భయ కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.

సీఐడీ అడిషినల్ ఎస్పీ సరిత మాట్లాడుతూ..ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాలో పనిచేస్తున్న వారు మహిళల పట్ల ఇంత అసభ్యకరంగా ప్రవర్తించడం మీడియాకి మాయని మచ్చలా ఉండిపోతుందన్నారు. మహిళల పట్ల జరుగుతున్న దాడులపై చైతన్యం కలిగించి, వాటిని క్రమంగా అంతమొందించేలా చేయాల్సిన మీడియానే ఇలా ప్రవర్తిస్తే సమాజంలో ఎవరూ మీడియాని నమ్మరన్నారు. ఏదేమైనా మహిళా పోలీస్ పట్ల ఇలా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సరిత పేర్కొన్నారు.

విశాఖ మహిళా డీఎస్పీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ...మహిళా పోలీసుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమన్నారు. మహిళా పోలీసులు దుస్తులు మార్చుకుంటుండగా వీడియోలు తీస్తే చూస్తూ ఉంటామనుకున్నారా ? ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఇంత జరిగితే మహిళా కానిస్టేబుల్ పై జరిగిన ఘటనను ఖండించాల్సిన సమాజం..సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ కాలయాపన చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story