అక్కడ బిడ్డ నేలమీద పడాలంటే.. ఎన్నో కిలోమీటర్లు నడవాల్సిందే..

By సుభాష్  Published on  1 Jan 2020 6:29 PM IST
అక్కడ బిడ్డ నేలమీద పడాలంటే.. ఎన్నో కిలోమీటర్లు నడవాల్సిందే..

అక్కడ తల్లి కడుపులోంచి బిడ్డ బయట పడాలంటే ఎన్నో కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి నెలకొంది. పురిటి నొప్పులతో బాధపడే మహిళలే కాదు.. ఆస్పత్రులకు వెళ్లే ఏ రోగులైన ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఏపీలోని విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం దాహపర్తి పరిధిలోని పొర్లు గ్రామంలో గిరిజనుల కష్టాలు అన్ని ఇన్ని కావు. గ్రామానికి సరైన రోడ్డు పౌకర్యం లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులకు గురి కావల్సి వస్తోంది. కనీసం అంబులెన్సు కూడా వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో గిరిజనుల కష్టాలు వర్ణానాతీతం. ఈ గిరిజన గ్రామంలో బుధవారం చిన్నమలు అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ వచ్చేందుకు ఆ గిరిజన గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అంబులెన్సు నిలిచిపోవల్సిన దుస్థితినెలకొంది. గ్రామం నుంచి పురిటినొప్పులతో ఉన్న మహిళను డోలికట్టి కట్టెల సాయంతో కొన్ని కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వచ్చి అంబులెన్సులో ఎక్కించారు. కాగా నొప్పులతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్ వద్దకు చేరుకునే లోపే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆమెను అంబులెన్స్ ల శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న తల్లిబిడ్డులు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కనీస రోడ్డు సౌకర్యం లేని గ్రామాల్లోన్నో..

దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కనీసం అంబులెన్స్‌ వెళ్లేందుకు రహదారి కూడా లేకపోవడంతో అధికారులు, రాజకీయ నేతలు సిగ్గుతో తలగించుకోవల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెబుతున్న నాయకులకు ఇదో ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక వైపు ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న నాయకులు.. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏపీలోని చాలా ప్రాంతాల్లో కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైన అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు వెళ్లాలంటే రోగిని డోలి కట్టి కట్టెల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లే దుస్థితి ఏర్పడుతుంది. కనీసం అత్యవసర సమయాల్లోనైన అంబులెన్సు కూడా వచ్చేందుకు కూడా దారి లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు కూడా రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. కనీసం గ్రామంలోకి అంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందంటే ఏ మేరకు అభివృద్ధి జరుగుతుందో అర్థమైపోతుంది. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆ గిరిజన గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story