దైవ నిర్ణయమో మరేమో కానీ ఆ తల్లి రైలు బండి టాయ్‌లెట్‌ లోనే బిడ్డకు జన్మనిచ్చింది. బీహార్ నుంచి చెన్నై కి గంగా కావేరీ ఎక్స్ ప్రెస్ లో వెళ్తున్న ఒక నిండు గర్భిణికి రైల్లోనే పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆమె రైల్వే కంపార్ట్ మెంట్ టాయ్ లెట్ లోనే ప్రసవించింది.

పింకీ దేవి అనే పాతికేళ్ల మహిళ బీహార్ లోని ఛప్రా నుంచి చెన్నైకి వెళ్తోంది. ఖమ్మం డోర్నకల్ మధ్య ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెకు టాయ్ లెట్ లోనే బిడ్డ పుట్టింది. రైలు టాయ్‌లెట్‌ లో పడున్న ఆమెను, బిడ్డను చూసిన పారిశుధ్య కార్మికులు తక్షణమే అధికారులకు ఫోన్ ద్వారా తెలియచేశారు. దాంతో అప్రమత్తమైన అధికారులు ఒక మహిళా రైల్వే పోలీసు కానిస్టేబుల్ ను, మరికొంత మంది చైల్డ్ లైన్ సిబ్బందిని ఆమెకు రక్షణగా ఉంచారు. రైలు ఖమ్మం చేరుకోగానే ఆమెను 108 ఆంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. దీని కోసం స్టేషన్ లో రైలు ఆరు నిముషాల పాటు ఆపాల్సి వచ్చింది. ఆమెకు ప్రాథమిక చికిత్స చేసిన తరువాత 108 సిబ్బంది ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో భర్తీ చేశారు.

పింకీ దేవి, ఆమె బిడ్డ ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు. పింకీ దేవి తనకు పుట్టిన పాపకు రైల్వే ఎక్స్ ప్రెస్ పేరే పెట్టాలని నిర్ణయించుకుంది. అంటే ఇక ఆ పాప పేరు గంగా కావేరి అన్న మాట.

Next Story