కరోనా పై దేశం మొత్తం చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తున్నాయి ప్రముఖ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు. ఇప్పటికే టాటా గ్రూప్ అన్నింటికన్నా ఎక్కువగా రూ.1500 కోట్ల విరాళమిచ్చింది. ఇన్ఫోసిస్ రూ.100 కోట్ల విరాళమివ్వగా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పీఎం కేర్స్ కు రూ.500 కోట్ల విరాళాన్నిచ్చారు. ఇప్పుడు ప్రముఖ కార్పొరేట్ సంస్థ విప్రో సైతం రూ.1125 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు నడుం కట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ స్వయంగా వెల్లడించారు.

కరోనా రాకాసి కారణంగా ఉపాధి లేక, కుటుంబ పోషణ గడవక ఇబ్బందుల పాలవుతున్న వారిని ఆదుకునేందుకు చాలా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయని, అలాంటి వారందరికీ సెల్యూట్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అలాగే విప్రో సంస్థ కూడా ప్రతి నిత్యం 20 లక్షల మంది ప్రజల కడుపు నింపుతోందని ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ఆర్థికంగా బలంగా ఉన్నవారు సైతం పెద్దమనసుతో పేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.