టిక్ టాక్ కోసం భర్తను వదిలేసిన పతివ్రత !!
By రాణి
“నీకు నేను కావాలా, టిక్ టాక్ కావాలా తేల్చుకో!” అని నిలదీశాడట భర్త. భార్య క్షణం కూడా ఆలోచించలేదు. “నాకు నా టిక్ టాక్ కావాలి. టిక్ టాక్ లోని లక్షల అభిమానులు కావాలి” అనేసిందట ఆ భార్య. “నువ్వు లేకుండా చాలా రోజులుగా బ్రతుకుతున్నాను. కానీ టిక్ టాక్ లేకుండా క్షణం బ్రతకలేను” అని ప్రకటించిందట కూడా.
ఇప్పుడు ఈ టిక్ టాక్ క్వీన్ భర్తను వదిలేసుకున్న వైనం బెంగుళూర్ లో భలే హాట్ టాపిక్. పన్నెండేళ్ల కాపురం, కోరినంత డబ్బు పంపించే భర్త, వారిద్దరి ప్రేమ ఫలంగా బుట్టిన ఓ బుజ్జాయి లకన్నా నా మిలియన్ ఫ్యాన్సే నాకు ముఖ్యం అంటున్న ఈ మహిళామణి ఇప్పుడు టాకింగ్ పాయింట్ గా మారింది. నజ్మా (అసలుపేరు కాదు) భర్త ఫారిస్ (ఇదీ మారుపేరే) లు పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఫారిస్ దుబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. నజ్మా అత్తమామల దగ్గర ఉంటుంది. నజ్మాకు పక్కింటావిడ టిక్ టాక్ ను పరిచయం చేసింది. అంతే...నజ్మాకు టిక్ టాక్ పిచ్చి పట్టింది. పగలూ రాత్రి లేకుండా టిక్ టాక్ విడియోలు చేయడం, పోస్టు చేయడం... ఆమెకు నిత్యకృత్యమైపోయింది. అయితే అత్తా మామలకు ఇదంతా తెలియదు.
అయితే ఆమె టిక్ టాక్ వీడియోలు వైరల్ హైవేలో పరుగులు తీశాయి. బెంగుళూరు నుంచి దుబాయి దాకా వెళ్లిపోయాయి. ఒక మిత్రుడు ఆ వీడియో షేర్ చేయడంతో ఫారిస్ కి తెలిసింది. ఆయన నిలదీస్తే, ఇది మార్ఫింగ్ అని నమ్మబలికింది. పైగా మార్ఫింగ్ చేసింది ఫారిస్ స్నేహితుడే అని ఆరోపించింది. కానీ నెమ్మదిగా ఆమె వీడియోలు ఒక్కొక్కటిగా ఫారిస్ కి చేరాయి. ఆయన ప్రశ్నించడం, ఈమె పెద్దగా ఏడ్చి గగ్గోలు పెట్టి కన్నీటి సంద్రాన్ని క్రియేట్ చేయడం...ఇదే తంతు. ఒక రోజు వచ్చిన టిక్ టాక్ వీడియోలో తన ఇంట్లోని వస్తువులు కనిపించడంతో ఫారిస్ మళ్లీ నిలదీశాడు. అప్పుడు నజ్మా ఆ అశ్లీల నృత్య భంగిమలన్నీ తనవేనని ఒప్పుకుంది. భర్త ఇవన్నీ మానేయమన్నాడు. ఆమె మాత్రం ససేమిరా అంది. నా మిలియన్ల మంది ఫ్యాన్లు ఏమైపోవాలి అని ఎదురు ప్రశ్న వేసింది.
విషయం ఇప్పుడు ఫామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ముంగిట్లోకి వచ్చింది. నా మిలియన్ల ఫ్యాన్లను వదులుకునేది లేదు. అవసరమైతే భర్తను వదిలేసుకుంటానని నజ్మా అనే పతివ్రతా శిరోమణి ప్రకటించింది. కౌన్సెలింగ్ చేసేవారు తలలు పట్టుకుని కూర్చున్నారు. సోషల్ మీడియా కారణంగా భార్యా భర్తల మద్య పొరపొచ్చాలు, కుటుంబాల మధ్య గొడవలు నానాటికీ పెరుగుతున్నాయని, దీని వల్ల వివాహ విచ్ఛేదాలు జరుగుతున్నాయని కౌన్సిలర్లు అంటున్నారు.