'పొద్దు తిరుగుడు పువ్వు' సూర్యుడి వైపు తిరగడానికి కారణం ఇదే..!

By సుభాష్  Published on  8 Feb 2020 3:49 PM GMT
పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరగడానికి కారణం ఇదే..!

ముఖ్యాంశాలు

► సూర్యుడికి - పొద్దు తిరుగుడుకు మధ్య సంబంధం ఏమిటీ..?

► సూర్యుడి వైపు తిరగడంపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?

► పరిశోధనల ద్వారా తేల్చిన శాస్త్రవేత్తలు

► పొద్దు తిరుగుడు పువ్వు గురించి గ్రీకులు చెప్పిన కథ

మబ్బుల చాటున తెరలు దాటుకుంటూ అందరికి గుడ్‌ మార్నింగ్‌ అంటూ ఉదయాన్నే వచ్చేస్తాడు సూర్యుడు. ఆ సూర్యుడికి ఎవరు బదులిచ్చినా.. బదిలివ్వకపోయినా.. పొద్దు తిరుగుడు పువ్వు మాత్రం ఎంతో చిలిపిగా నవ్వుతూ గుడ్‌ మార్నింగ్‌ చెబుతుంటుంది. మరి అందరి కంటే ముందే శుభోదయం చెప్పడమే కాదండోయ్‌.. ప్రతి క్షణం కూడా ఆ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంతకీ సూర్యుడికి.. పొద్దుతిరుగుడు పువ్వుకు ఉన్న సంబంధం ఏమిటీ..? అనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. సూర్యుడు ఎటు వైపు వెళ్తున్న అటు వైపే పొద్దు తిరుగుడు పువ్వు తిరుగుతుందని అందరికి తెలిసిందే తప్ప.. మరి అలా ఎందుకు తిరుగుందో అనే విషయం చాలా మందికి తెలియదు.

సూర్యుడితో బలమైన బంధం

పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడితో బలమైన బంధం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతి రోజూ ఉదయం తూర్పు వైపునకు తిరిగి ఉండి, తర్వాత సూర్యుడితో పాటు తన దిశను మార్చుకుంటూ ఉంటుంది. దీనినే ఫోటోట్రోఫిజం అంటారు. ఈ ఫోటోట్రోఫిజం కాంతి ప్రేరణ వల్ల కలిగే పెరుగుదలకు సంబంధించిన ప్రక్రియ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ పొద్దు తిరుగుడు మొక్క కాండంలోని ఆక్సిన్‌ అనే హార్మోన్‌ ఈ చర్యలకు కారణంగా చెప్పవచ్చు. ఆక్సిన్స్‌ మొక్కలు పొడవుగా పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీటా ఇండైల్‌ అసిటిక్‌ యాసిడ్‌, అమైనో ఆసిడ్స్‌ నుంచి కానీ, కార్పోహైడ్రేట్‌ల విచ్ఛిన్నం వల్ల ఏర్పడే గ్రైకోసైట్స్‌ నుంచి కానీ ఏర్పడుతుంది.

కణక వచంలోని రసాయన బంధాలపై ఆక్సిన్స్‌ పని చేసే అది పొడవు పెరిగేటట్లు చేస్తాయట. ఈ సన్‌ప్లవర్‌ మొక్కలో ఒక వైపు నీడ ఏర్పడితే ఆ భాగంలో పెద్ద మొత్తంలో ఆక్సిన్స్‌ ఉత్పత్తి అవుతాయి. మొక్క ఆ భాగంలో చాలా వేగంగా పొడవు పెరిగేటట్లు చేస్తాయి. అలాగే సూర్యకాంతి లేని వైపు మొక్క కాండం పొడవుగా పెరగడం కారణంగా సూర్యకాంతి వైపు మొక్కవాలుతుంది. అందుకే పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరుగుతుంది. ఈ కారణంగా పొద్దు తిరుగుడు పువ్వు అని పేరు వచ్చింది.

కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?

పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరగడంలో ఉన్న రహస్యాన్ని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసింది. పువ్వు కాడల్లోని మూలకణాల ప్రత్యేక ఎదుగుదలనే ఇందుకు అసలైన కారణమని వారు స్పష్టం చేశారు. కాడల్లో పగటి పూట తూర్పు వైపున్న మూలకణాలు పెరగడంతో, పువ్వు తిరిగి ఇటువైపు వంగిపోతుంది. పువ్వు ఉష్ణోగ్రతను గ్రహించడం కారణంగా ఇలా జరుగుతుందని వారు తేల్చారు.

Sunflowers And Sun

పరిశోధకుల ప్రయోగాలు

అలాగే సూర్యుడికి, పొద్దు తిరుగుడు పువ్వుకు ఉన్న బంధాన్ని తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయోగాలు కూడా చేశారు. పొద్దు తిరుగుడు మొక్కల కాండాలపై సిరా మరకలు ఉంచారు. ఆ మొక్క ఎదుగుదలను కెమెరాలతో వీడియో చిత్రీకరించారు. సూర్యుడి వైపు పువ్వు తిరగడంలో వచ్చిన మార్పులను పరిశోధకులు గమనించారు. ప్రతి రోజు ఉదయం సూర్యుడి లేత కిరణాలు పడగనే ఉష్ణోగ్రత బట్టి, పువ్వు తల భానుడి వైపు ఉండేలా మూల కణాలు పెరుగుతాయి. సూర్యుడి నుంచి అధిక శక్తి పొందేందుకు మొక్కలు ఇలా చేస్తాయని పరిశోధకులు భావించారు.

పొద్దు తిరుగుడు పువ్వు గురించి గ్రీకులు చెప్పిన కథ

సూర్యుడిని గ్రీకులు 'అపోలో'గా భావిస్తారు. శక్తికి, జీవానికి, కాలానికి ఆయన ప్రతీక. ఆయన ఎంతో అందాన్ని కలిగి ఉంటాడు. బంగారు వన్నె కురులతో తేజోమయమైన కన్నులతో సూర్యుడు ఎంతో అందంగా కనిపిస్తుంటాడు. ఆయనను అందరు ఇష్టపడతారు. కాగా, 'క్లైటీ' అనే వనదేవత ఆయనను ఎంతో ప్రమించేది. సూర్యుడు ఆమె ప్రేమను తిరస్కరించాడు. జల దేవుని కుమార్తె అయిన 'డఫ్నే'ను సూర్యుడు ప్రేమలో పడతాడు. కానీ 'డఫ్నే' సూర్యుడిని ప్రేమించలేదు. కానీ ఒక వైపు సూర్యుడిని ఎంతో ప్రేమించిన 'క్లైటీ' 9 రోజుల పాటు ఉపవాసంగా ఉంటూ ఉన్నచోటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు అలానే చూస్తూ ఉండిపోయింది. క్రమ క్రమంగా ఆమె ఒక పువ్వుగా మారింది. ఆ పువ్వే పొద్దు తిరుగుడు పువ్వు (సన్‌ప్లవర్‌). ఇలా కూడా పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని చుట్టు తిరగడానికి కారణమని ఈ కథ కూడా ఉంది.

Next Story