కరోనా మున్ముందు విశ్వరూపం చూపిస్తుంది: WHO సంచలన వ్యాఖ్యలు

By సుభాష్  Published on  21 April 2020 11:54 AM IST
కరోనా మున్ముందు విశ్వరూపం చూపిస్తుంది: WHO సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే గజగజ వణికిపోవాల్సిందే. ఈ వైరస్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే 25 లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడగా, 1.66 లక్షలకుపైగా మరణించారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ సైతం కుదేలైపోయింది. ఎక్కడికక్కడ స్థంభిచిపోయింది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇప్పటి వరకూ కరోనా ప్రభావం స్వల్పమే అయినా.. మున్ముందు దీని ప్రభావం మరింతగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్ట్‌ జనరల్‌ టీడ్రాస్‌ అడ్హనామ్‌ వ్యాఖ్యనించారు. జెనీవాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశాల్లో ఇప్పుడిప్పుడు విశ్వరూపం చూపెట్టడం ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను శాశ్వతంగా అమలు చేసే వీలులేదన్నారు.

కాగా, ఆరోగ్య విధానం తక్కువ అభివృద్ధి చెందిన ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణమృదంగం సృష్టించనుందని జాన్‌ మాప్కిన్స్‌ యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ విషయాన్ని కూడా డబ్ల్యూహెచ్‌వో గుర్తు చేసింది. 1918లో వచ్చిన స్పానిష్‌ ప్లూకు ఎన్నో సారూప్యాలున్నాయని, స్పానిష్‌ ప్లూ తరహాలోనే కరోనా సైతం నిదానంగా విజృంభించి ప్రాణాలు తీస్తోందని హెచ్చరించారు.

మహమ్మారి విశ్వరూపం మున్ముందు కనిపిస్తుంది

కరోనా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనదని, మున్ముందు విశ్వరూపం చూపిస్తుందని నేను నమ్ముతున్నాను. కరోనాను నివారించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పని చేయాలి. కరోనా మహమ్మారి చూపే ప్రభావంపై చాలా మందికి అవగాహన లేదు.. అని అన్నారు. 1918లో ప్లూ వల్ల దాదాపు కోటి మంది మరణించారని, ఈ వైరస్‌ కూడా అలాగే చేస్తుందని అన్నారు.

Next Story