డబ్ల్యూహెచ్‌వో మమ్మల్ని మోసంచేసింది.. నిధులు నిలిపివేస్తాం - ట్రంప్‌

By Newsmeter.Network  Published on  8 April 2020 3:37 AM GMT
డబ్ల్యూహెచ్‌వో మమ్మల్ని మోసంచేసింది.. నిధులు నిలిపివేస్తాం - ట్రంప్‌

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడు ఎవరిపై విరుచుకు పడతారో.. ఎప్పుడు ఎవర్ని పొగుడుతారో చెప్పలేం. ట్రంప్‌ తీరుతో ఇప్పటికే పలు దేశాలు అగ్రరాజ్యంపై గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు. మమ్మల్ని డబ్ల్యూహెచ్‌వో మోసం చేసిందని, ఎందుకు తప్పుడు సలహాలు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంతకి ఏమైంది..? డబ్ల్యూహెచ్‌వో అంత తప్పు ఏం చేసింది అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే.. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఈ మహమ్మారితో పెద్దదేశాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతుంది. దేశంలో ఇప్పటికే 3.80లక్షల మందికిపైగా కరోనా వైరస్‌ భారిన పడగా, వీరిలో 11,907 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క మంగళవారం రోజే 13, 740 పాజిటివ్‌ కేసులు నమోదు కావటం అక్కడ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తీరుకు అద్దపడుతుంది.

Also Read :కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రభుత్వం దృష్టి

కరోనా కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చూస్తుండగానే చికిత్స పొందుతున్న వారు పిట్టల్లా రాలిపోతున్నారు. న్యూయార్క్‌లో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. అమెరికాలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజంగా తమను మోసం చేసి దెబ్బతీసిందని మండిపడ్డారు. అమెరికా నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందుకుంటున్నప్పటికీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో చైనీయులను అమెరికాలోకి అనుమతించవచ్చంటూ డబ్ల్యూహెచ్‌వో ప్రతిపాదనలు చేసిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇలాంటి తప్పుడు సలహాలు ఎందుకు ఇచ్చారంటూ ట్విట్టర్‌ వేదికగా ట్రంప్‌ నిలదీశారు. దీనికితోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధులను ఉపసంహరించుకుం టామంటూ ట్రంప్‌ బెదిరింపులకు దిగడం గమనార్హం. ట్రంప్‌ వ్యాఖ్యలపై డబ్ల్యూహెచ్‌వో అధికారులు ఇప్పటికీ స్పందించలేదు. మరి వారు ఎలాంటి సమాధానం ఇస్తారో..? ట్రంప్‌ వారి సమాధానానికి సంతృప్తి పడతారా.. లేక వారిపై కలుదువ్వుతాడా.. అనేది వేచి చూడాల్సిందే.Next Story