పర్యాటకుల స్వర్గంలో బద్దలైన అగ్నిపర్వతం

By Newsmeter.Network  Published on  11 Dec 2019 5:59 AM GMT
పర్యాటకుల స్వర్గంలో బద్దలైన అగ్నిపర్వతం

న్యూజీలాండ్ లోని పర్యాటకుల స్వర్గం వైట్ ఐలండ్ ఒక్క సారిగా తెల్లని మృత్యువస్త్రం కప్పిన స్మశానంగా మారిపోయింది. సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి శతాబ్దాలుగా నిద్రిస్తున్న అగ్నిపర్వతం నిప్పులు కక్కుతూ లావాను విరజిమ్మింది. తెల్లని పొడి మొత్తం ద్వీపాన్ని ఆక్రమించేసింది. ఆకాశంలో దాదాపు 12 కిమీ వరకూ ఈ తెల్లని దుమ్ము ఆక్రమించేసింది. దీనితో కనీసం 13 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా.

పలు విషవాయువులు ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలై ద్వీపమంతటా వ్యాపించాయి. దీనితో పర్యాటకులు, సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు. దురదృష్టం ఏమిటంటే గత వారమే అగ్నిపర్వతం లో కదలికలు మొదలయ్యాయని, దీని వల్ల అది బద్దలయ్యే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా టూర్ ఆపరేటర్లు పర్యాటకులను ఎందుకు తీసుకువెళ్లారన్న విషయంపై పోలీసు దర్యాప్తు మొదలైంది. న్యూజీలాండ్ ప్రధాని జాసిండా ఆర్డెన్ ఈ ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ఇప్పటి వరకూ 13 మంది చనిపోయారని, మరో ఎనిమిది మంది ఆచూకీ తెలియడం లేదని ఆమె ప్రకటించారు. ఈ ద్వీపం సమీపంలో విమానాలు చక్కర్లు కొట్టి ఎవరైనా బ్రతికుంటే వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

వైట్ ఐలండ్ న్యూజిలాండ్ లోని బే ఆఫ్ ప్లెంటీ అనే పర్యాటక స్థలానికి 30 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడికి ఏటా 17000 మంది పర్యాటకులు వస్తూంటారు. వీరిలో ఎక్కువమంది ఆస్ట్రేలియా అమెరికాల నుంచి వస్తూంటారు. ప్రమాదం జరిగిన సమయంలో ద్వీపంపై 30 మంది వరకూ ఉంటారని అంచనా. వీరిలో చైనా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, మలేషియాలకు చెందిన వారు ఉన్నారు. కనీసం ముగ్గురు ఆస్ట్రేలియన్లు ఉన్నారని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. వీరే కాక మరో 31 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో కనీసం అయిదుగురు ఆస్ట్రేలియన్లు ఉన్నారని తెలుస్తోంది. వైట్ ఐలండ్ టూర్ ఆపరేటర్లు తమ టూర్ గైడ్లు ఇద్దరు కనిపించడం లేదని ప్రకటించింది. బ్రిటన్ తమ వారు ఇద్దరు చికిత్స పొందుతున్నారని తెలియచేసింది.

Next Story