కలుగులో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించేందుకు, భోషాణాల్లో దాచిన డ్రగ్స్ ను వెలికి తీసేందుకు శునకాలకు శిక్షణనివ్వడం మనందరికీ తెలుసు. ఇప్పుడు మూర్ఛవ్యాధి, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు కూడా శునకాలు సిద్ధమౌతున్నాయి.

ఎనిమిది నెలల క్రితం కెనడా నుంచి తెచ్చిన వైట్ జర్మన్ షెపర్డ్ జాతి కుక్కలకు పెట్రోల్, డీజిల్ , గ్యాస్ లీకులను, ఉగ్రవాదులను, డ్రగ్స్ ను గుర్తించడం తో పాటు ఎపిలెప్సీ,క్యాన్సర్లను కూడా గుర్తించడానికి చండీగఢ్ లోని డేరా బాసీ లో ఉన్న పోలీసు శునకాల శిక్షణ కేంద్రంలో శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం కెనడాలోని వాంకూవర్ నుంచి తెచ్చిన నాలుగు శునకాలకు ఈ శిక్షణనిస్తున్నారు. కెనడాలో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగంలో శునకాలకు శిక్షణనిచ్చిన కుల్దీప్ సింగ్ ను ఇందుకోసం ప్రత్యేకంగా తీసుకువచ్చారు.

Also Read : మారుతీరావు ఆత్మహత్య చేసుకొనే పిరికివాడు కాదు

మూర్ఛవ్యాధి రావడానికి ముందు రోగి శరీరంలో రసాయనిక మార్పులు సంభవిస్తాయి. దీనిని కుక్కలు ముందుగానే పసిగట్టి రోగి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేస్తాయి. కనీసం రెండు మూడు నిముషాల ముందు అప్రమత్తం చేయడం వల్ల మందులు తినిపించడానికి, వైద్యసాయం అందించడానికి వీలు కలుగుతుంది. ఇప్పటికే కెనడా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో మూర్ఛ వ్యాధి బాధితులకు శునకాలు సాయం చేస్తున్నాయి. అధికారులు పది నెలల పాటు శిక్షణ పొందిన శునకాలను మూడు వేల డాలర్లకు అమ్మడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదే విధంగా మనిషి ముఖం వాసన చూసి క్యాన్సర్ కణాలను శునకాలు గుర్తించగలుగుతాయి. ఇప్పటికే పలు దేశాలలో ఈ తరహా శిక్షణ పొందిన శునకాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స చేయడం సులువౌతుంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.