ఆ ఇద్ద‌రు అమ్మాయిలు.. నిత్యానంద ఎక్క‌డికి వెళ్లారు.?

By Newsmeter.Network  Published on  24 Nov 2019 5:27 AM GMT
ఆ ఇద్ద‌రు అమ్మాయిలు.. నిత్యానంద ఎక్క‌డికి వెళ్లారు.?

వివాద‌స్ప‌ద‌స్వామి నిత్యానంద మళ్లీ చిక్కుల్లో ఇరుక్కున్నారు. తన ఇద్దరు కూతుళ్లను నిత్యానంద నిర్భంధించారని, అహ్మదాబాద్‌ ఆశ్రమం నుంచి వాళ్లిద్దరికి విముక్తి కల్పించాలని గుజరాత్‌కు చెందిన జనార్ధన్‌ శర్మ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో గుజరాత్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఆశ్రమంలో సోదాలు చేశారు. నిత్యానంద శిష్యురాళ్లు ప్రాణ ప్రియానంద , ప్రియతత్వ రిధికిరణ్‌ను అరెస్ట్‌ చేశారు. తమ కూతుళ్లను కలవడానికి ఆశ్రమ నిర్వహకులు అనుమతినివ్వడం లేదని శర్మ దంపతులు ఆరోపించారు. శర్మ ఇద్దరు కూతుళ్లను నవంబర్‌ 26 లోగా తమ ముందు హాజరుపర్చాలని గుజరాత్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇద్దరి కోసం పోలీసులు ఆశ్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ప్రాణతత్వ, ప్రాణప్రియలను విచారిస్తున్నారు.

ఈ తాజా కేసుతో నిత్యానంద కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారని సెర్చ్‌ ఆపరేషన్ నిర్విహిస్తున్నారు. నిత్యానంద విదేశాలకు పారిపోయినట్టు గుజరాత్‌ పోలీసులు నిర్ధారించారు. నకిలీ పాస్‌పోర్ట్‌తో నిత్యానంద విదేశాలకు పారిపోయినట్టు అనుమానిస్తున్నారు.నిత్యానంద ట్రినిడాడ్‌ -టొబాగోలో ఉన్నాడని ప్రాధమిక సమాచారం అందింది. బెల్జియంతో పాటు వెనిజులాలో కూడా తలదాచుకునే అవకాశాలున్నాయని ఆయన మాజీ సన్నిహితులంటున్నారు. మైనర్‌ బాలికలను నిర్భంధించినట్టు అహ్మదాబాద్‌లో నిత్యానంద ఆశ్రమంపై తాజాగా కేసు నమోదయ్యింది.

నిత్యానందపై ఇప్పటికే రేప్‌ కేసులు, చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు అమ్మాయిల కిడ్నాపింగ్‌ వ్యవహారం కూడా వెలుగు లోకి రావడంతో ఆయన పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. బెంగళూర్‌ ఆశ్రమంతో పాటు అహ్మదాబాద్‌ ఆశ్రమంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే నిత్యానంద జాడ ఇప్పటికి కూడా తెలియడం లేదు.

నిత్యానంద ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో అంతుచిక్కడం లేదు. కేసులకు భయపడి ఆయన విదేశాలకు చెక్కేసినట్టు స్పష్టమైన ఆధారాలను గుజరాత్‌ పోలీసులు సేకరించారు. అయితే తాను హిమాలయాల్లో ఉన్నానని ప్రకటన విడుదల చేశారు స్వామి నిత్యానంద. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Next Story