వర్షాల బీభత్సం... నీటమునిగిన కాజీపేట రైల్వే స్టేషన్ (వీడియో)
కాజీపేట రైల్వే స్టేషన్ నీటమునిగింది. స్టేషన్ లో దాదాపు మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచి ఉన్నాయి.
By Srikanth Gundamalla
వర్షాల బీభత్సం... నీటమునిగిన కాజీపేట రైల్వే స్టేషన్ (వీడియో)
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.వరంగల్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వానలకు ఓరగల్లు నగరం అతలాకుతలమైంది. నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
మరోవైపు నగరంలోని కాజీపేట రైల్వే స్టేషన్ (Kazipet railway station) నీటమునిగింది. స్టేషన్ లో దాదాపు మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచి ఉన్నాయి. రైల్వే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, హసన్‌పర్తి-ఖాజీపేట రూట్‌లో రెండు రైళ్లు రద్దు కాగా, పలు రైళ్లను దారి మళ్లించారు. కాజీపేట రైల్వే స్టేషన్‌లో నీరు నిలిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనీసం అక్కడ పట్టాలు ఉన్నది కూడా కనిపించడం లేదు.
వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచి ఉంది. వరంగల్-ఖమ్మం నేషనల్ హైవే జలదిగ్భందమైంది. మైలారం వద్ద భారీ చెట్టు కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ గా ఉండాలని అధికారులు ఆదేశించారు. పలుచోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుగ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు భారీగా కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. మరో వైపు రేపు కూడా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.