దేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానిది కీలక పాత్ర: ప్రధాని మోదీ

దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు ప్రధాని మోదీ.

By Srikanth Gundamalla  Published on  8 July 2023 7:49 AM GMT
PM Modi Comments, Warangal Tour,  CM KCR,

 దేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానిది కీలక పాత్ర: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు అంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. విజయ సంకల్ప సభ వేదికగానే ప్రధాని పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. హన్మకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలువ్యాగన్ల కర్మాగార నిర్మాణం, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తవుతుందని.. దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు ప్రధాని మోదీ. రూ.6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం శరవేగంగా పనులు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నామని, కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తోందని అన్నారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాణి రుద్రమ దేవి పరాక్రమాణికి చిరునామ వరంగల్.. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందని అన్నారు. కేసీఆర్ సర్కార్ అత్యంత అవినీతి ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. వీరి అవినీతి ఢిల్లీ వరకు పాకిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుంటే.. మరి రాష్ట్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం రాష్ట్రాలు కలిసి పని చేస్తుంటాయి. తొలిసారి అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యం అని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలాంటి అవినీతి పాలనను చూసేందుకేనా తెలంగాణ పోరాటంలో ఆత్మబలిదానాలు జరిగాయి అని ప్రశ్నించారు. కేంద్రాన్ని విమర్శించడం మాత్రమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని ప్రధాని మోదీ అన్నారు. యువతను మోసం చేసింది, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని చెప్పారు. తెలంగాణ వర్సిటీల్లో 3వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉంటే.. పాఠశాలల్లో వేల సంఖ్యలో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఎందుకు పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్నారని నిలదీశారు. కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని అనడం సరికాదన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తోందని చెప్పారు. గత 9 ఏల్లలో కేంద్రం రూ.లక్ష కోట్లకు పైగా నిధులను రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. ఆదివాసీలకు కేసీఆర్ ఏం చేయలేదని, కేంద్రమే రహదారులను వేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.

Next Story