బావిలో 9 మంది మృతదేహాలపై మిస్టరీ వీడేనా..?.. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏముంది..!

By సుభాష్  Published on  23 May 2020 7:37 AM GMT
బావిలో 9 మంది మృతదేహాలపై మిస్టరీ వీడేనా..?.. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏముంది..!

తెలంగాణలోని వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెలకుంట బావిలో బయటపడ్డ 9 మంది మృతదేహాల మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అయితే 9 మంది మృతదేహాలకు ఎలాంటి గాయాలు లేవు. వాళ్లు ఎలా మరణించారనేది మిస్టరీగా మారింది. బుధవారం రాత్రి 9 గంటల గంటల ప్రాంతంలో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కోసం అందరు ఎదురు చూస్తుండగా, వాళ్లంతా ప్రాణాలతో ఉండగానే బావిలోపడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినట్లు సమాచారం. వాళ్లంతటా వాళ్లే బావిలో పడ్డారా..? ఎవరైన ఆహారంలో విషం కలిపి ఇచ్చి బతికుండగానే బావిలో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మక్సూద్‌ కుటుంబం పశ్చిమబెంగాల్ నుంచి వరంగల్‌లోని కరీమాబాద్‌కు 20 ఏళ్ల క్రితం వలస వచ్చింది. గొర్రెలకుంటలోని గోనెసంచీల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా కరీమాబాద్‌ నుంచి రావడం ఇబ్బందిగా ఉందని మక్సూద్‌ ఫ్యాక్టరీ యజమానికి చెప్పగా, ఫ్యాక్టరీలోనే ఉండాలని యజమాని చెప్పడంతో అక్కడే ఉంటున్నారు.

అదే ఆవరణలో శ్యామ్‌, శ్రీరామ్‌ అనే బీహార్‌కు చెందిన యువకులు ఉంటున్నారు. బుధవారం రోజు మక్సూద్‌ కుటుంబం కనిపించకుండా పోవడంతో ఫ్యాక్టరీ యజమాని సంతోష్ చుట్టుపక్కల గాలించగా, ఓ బావిలో శవాలు కనిపించాయి. ముందుగా నాలుగు శవాలు బయటపడగా, తర్వాత మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. శ్యామ్‌, శ్రీరామ్‌ యువకులతో పాటు మక్సూద్‌ ఇద్దరు కుమారుల శవాలు బయటపడ్డాయి. అలాగే మక్సూద్‌ మిత్రుడైన షకీల్‌ శవం కూడా బయటపడింది. ఇక వీరందరిని ఎవరో చంపేశారనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఆహారంలో విషం కలిపి చంపేశారా..?

కాగా, మక్సూద్‌ కూతురు బుస్రాకు వరంగల్‌ కు చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుస్రాపై బీహార్‌ యువకులు శ్యామ్‌, శ్రీరామ్‌ కన్నేయడం అతనికి నచ్చలేదా.. అందుకే అతను అందరిని చంపేశాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంత మందిని ఒక్కడే చంపేయడం సాధ్యం కాదని, మరి కొందరు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బుస్రా కుమారుడి పుట్టిన రోజు ఉండటంతో వేడుకకు బుస్రాతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో తినే ఆహారంలో విషం కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, కొన్ని నెలల క్రితం మక్సూద్‌ కూతురు బుస్రా ముంబైలోని భర్తకు విడాకులు ఇచ్చి ఇక్కడే తల్లిదండ్రులతో ఉంటోంది. బుస్రా వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఇష్టంలేని మాజీ భర్త ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ఫోన్‌ కాల్స్‌ కీలకం

ఈ కేసులో ముఖ్యంగా ఫోన్‌ కాల్స్‌ ఆధారాలు కీలకంగా మారనున్నాయని పోలీసులు భావిస్తున్నారు. బుస్రాతో సన్నిహిత సంబంధాలున్నాయని అనుమానిస్తున్న యాకూబ్‌ ఫోన్‌ కాల్స్‌తో పాటు ఇతరులతో మక్సూద్‌ ఏం మాట్లాడాడనే విషయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మృతుల్లో ఏడుగురు సెల్‌ఫోన్లు కనిపించకపోవడంతో వాటి కోసం వెతుకుతున్నారు. ఈ కేసులు ఇప్పటికే అదుపులో ఉన్న యాకూబ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అతనితో పాటు బీహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ను విచారిస్తున్నారు.

Next Story