ఒంటరి ఆడవాళ్లకు అర్థరాత్రులు సేఫేనా?

By రాణి  Published on  5 March 2020 12:36 PM GMT
ఒంటరి ఆడవాళ్లకు అర్థరాత్రులు సేఫేనా?

ఆడది అర్థరాత్రి ఒంటరిగా వెళ్తేనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు. గాంధీజీ చెప్పిందిదే. అసలు రాత్రిళ్లు నగరంలో రోడ్లు ఎంత సేఫ్ ? అర్ధరాత్రి ఒంటరి ఆడది ఎంత సేఫ్ ? ఈ విషయం కనుక్కోవడానికే ముగ్గురు మహిళలు అర్థరాత్రి ఒంటరిగా తిరువనంతపురం వీధుల్లో తిరిగారు. ఒకరు బైక్ రైడర్. ఒకరు సామాజిక కార్యకర్త, మరొకరు కళాకారిణి. వీరు ముగ్గురూ వేర్వేరుగా తిరువనంతపురం వీధుల్లో అర్థరాత్రి తిరిగితే ఏమైంది? అది తెలుసుకోవడానికే ఈ కింద కథనాన్ని చదవండి.

షైనీ రాజకుమార్, లిజీ శ్రీధర్, సినీ కళాకారిణి వినీతా దీపక్ లు తిరువనంతపురంలోని చీకటి వీధుల్లో ఒంటరిగా బయలు దేరారు. వీరంతా ట్రివేండ్రం ఛాంబర్ ఆఫ్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సభ్యులు. వీరు వెళ్లిన మార్గాలు ఎక్కువగా వీధుల్లో దీపాలు లేని చీకటి ప్రదేశాలు. తాను ఒంటరిగా నడిచి వెళ్తుండగా ఒక నడి వయస్కుడు వచ్చి “అమ్మా.. మీ ఇల్లెక్కడో చెప్పు..దింపుతాను” అని లిఫ్ట్ ఆఫర్ చేశాడు. బస్ స్టాండ్ లో నిలబడి ఉండగా ఓ యువకుడు రెండు మూడు చక్కర్లు కొట్టి “వస్తావా.. రేటెంత” అని అడిగాడు. “నేను ఈ సంఘటనను రికార్డు చేయడానికి ప్రయత్నించాను. దాంతో ఆ కుర్రాడు తోకముడిచాడు.” అని చెప్పింది షైనీ. “అయితే మహిళలు భయపడాల్సింది తాగుబోతులను చూసి. వారు హింసకు పాల్పడే ప్రమాదం ఉంది. అప్పుడు మానసిక స్థైర్యం ఒక్కటే చాలదు. అలాంటప్పుడు మార్షల్ ఆర్ట్స్ వంటివి వచ్చి ఉంటే ఉపయోగం ఉంటుంది” అంది షైనీ.

Walk Alone Mid Night 2

అయితే బాగా వీధి దీపాలుండి, వెలుతురు ఉన్నచోట తమ వద్దకు రావడానికి మగవారు సందేహించారని షైనీ చెబుతోంది. వినీతా దీపక్ ఎంచుకున్న మార్గం కాస్త వెలుతురు ఉన్న మార్గం. ఆమెను కూడా కొందరు యువకులు వెంబడించారు. హాయ్ హల్లో అన్నారు. కొందరు అశ్లీల చేష్టలు చేశారు. కానీ నడిచి వెళ్తుంటే మాత్రం ఎవరూ వెంబడించలేదని ఆమె చెప్పారు. అయితే మనుషుల కన్నా పెద్ద సమస్య వీధికుక్కలేనని ఆమె అంటున్నారు. వీధి కుక్కల వల్లే ఎక్కువ భయం వేసిందని ఆమె చెబుతున్నారు. అయితే కుక్కలు కూడా కాస్త దూరం వరకూ వెంబడించి, ఆ తరువాత వెనక్కి మళ్లిపోయాయని ఆమె చెబుతున్నారు. లిజీ శ్రీధర్ మాత్రం సీసీ టీవీలు ఎక్కువగా ఉన్న దారుల్లోనే వెళ్లడంతో ఎలాంటి సమస్యలూ ఎదుర్కోలేదు.

Walk Alone Mid Night 3Walk Alone Mid Night 4

కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యల్ని వదిలేస్తే ఆడాళ్లకు అర్ధరాత్రులు సేఫే అనుకోవచ్చా?

Next Story