347 లోక్ సభ సీట్లలో ఓట్ల గల్లంతు, ఎడిఆర్ నివేదిక

By రాణి  Published on  15 Dec 2019 7:14 AM GMT
347 లోక్ సభ సీట్లలో ఓట్ల గల్లంతు, ఎడిఆర్ నివేదిక

ముఖ్యాంశాలు

  • లక్షకు పైగా లోక్ సభ ఓట్లు గల్లంతు
  • విపక్షాల ఆరోపణలు నిజమేనంటున్న ఎడిఆర్ ?

హైదరాబాద్ : 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలపై విపక్షాలు పూర్తి స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశాయి. పూర్తి స్థాయిలో ఓట్లు గల్లంతైనట్లుగా ఆరోపణలు కూడా చేశాయి. దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ లోక్ సభ స్థానాల్లో గల్లంతైన ఓట్ల గురించి ఒక సర్వే చేసి వివరాలను ఒక నివేదికలో వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం 347 లోక్ సభ స్ఠానాల్లో ఓట్లు భారీగా గల్లంతైనట్టు ఎడిఆర్ చెబుతోంది.

మొత్తం 542 లోక్ సభ నియోజకవర్గాల్లో 347 నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో ఓట్లు గల్లంతైనట్టుగా ఎడిఆర్ చెబుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో గల్లంతైన ఓట్లు గెలుపు ఓట్ల మార్జిన్ కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించామని ఎడిఆర్ సర్వే అంటోంది. కొన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా లక్ష ఓట్లకుపైగా గల్లంతైనట్టుగా ఎడిఆర్ నివేదిక చెబుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ అత్యంత విలువైనదే. కొన్ని సందర్భాల్లో కేవలం ఒక్క ఓటు అభ్యర్థుల భవితవ్యాన్ని తిరగరాస్తుంది. ఈ కారణంగా భారీ స్థాయిలో గల్లంతైన ఓట్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎడిఆర్ అంటోంది. 2018 డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని విపక్షాలు చేసిన ఆరోపణలు పూర్తి స్థాయిలో వాస్తవాలని ఈ సంస్థ చెబుతోంది. ఎడిఆర్ సర్వేలో 195 లోక్ సభ స్థానాల్లో ఎలాంటి అవకతవకలు, ఓట్ల గల్లంతు జరగలేదని చెబుతోంది. ఓట్లు గల్లంతైన 347 నియోజకవర్గాల్లో మాత్రం గల్లంతైన ఓట్ల సంఖ్య అత్యల్పంగా ఒకటినుంచి అత్యధికంగా 1,01,323 ఓట్ల వరకూ ఉందని తెలిపింది. మొత్తం ఓట్లలో గల్లంతైన ఓట్లు 10.49 శాతమని ఎడిఆర్ చెబుతోంది.

ఏపీలో కూడా...

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, విశాఖపట్నం లాంటి పెద్ద లోక్ సభ స్థానాలతో కలిపి మొత్తం ఆరు లోక్ సభ స్థానాల్లో గల్లంతైన ఓట్లు గెలుపు మార్జిన్ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నట్టుగా ఎడిఆర్ తాను చేసిన సర్వేలో గుర్తించింది. ఈ ఆరు లోక్ సభ స్థానాల్లో 7,39,104 ఓట్లు గల్లంతయ్యాయని ఎడిఆర్ బల్లగుద్ది వాదిస్తోంది. గుంటూరు లోక్ సభ స్థానంలో టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్ వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు. ఎడిఆర్ సర్వే ప్రకారం గల్లా జయదేవ్ 4,205 ఓట్లతో విజయం సాధించగా ఈ నియోజకవర్గంలో గల్లంతైన ఓట్ల సంఖ్య 6,982. అంటే గెలుపు మార్జిన్ ఓట్లకంటే ఇది చాలా ఎక్కువ. అలాగే విశాఖపట్నం లోక్ సభ స్థానంలో వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థి ఎం.వి.వి సత్యనారాయణ టిడిపి అభ్యర్థి ఎమ్.భరత్ పై విజయం సాధించారు. ఎడిఆర్ సర్వే ప్రకారం గెలుపు మార్జిన్ 4,414 ఓట్లు. కానీ ఈ నియోజకవర్గంలో గల్లంతైన ఓట్ల సంఖ్య 4,956.

ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంది

అనంత్ నాగ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్ లోని కుంతి, ఒడిషాలోని కోరాపుట్, ఉత్తర్ ప్రదేశ్ లోని మచిలీ షెహర్ లోక్ సభ స్థానాల్లోకూడా భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని ఈ సర్వే నివేదిక తేటతెల్లంచేసింది. ఈ నియోజకవర్గాల్లో కూడా విన్నింగ్ మార్జిన్ ఓట్లకంటే గల్లంతైన ఓట్ల సంఖ్యే అధికంగా ఉందని సర్వే తేల్చింది. ఫలితాలు వెల్లడైన కొద్దిరోజుల తర్వాత జూన్ 1, 2019న ఎలక్షన్ కమిషన్ ఒక అధికారిక ప్రకటనలో లెక్కించిన ఓట్ల జాబితాను విడుదల చేస్తానని వెల్లడించిందని ఎడిఆర్ అంటోంది. దీన్నిబట్టి ఓట్లు గల్లంతయ్యాయన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని ఎడిఆర్ వాదిస్తోంది.

ఎడిఆర్ ఏం చెబుతుందంటే..

నిజానికి కొద్ది రోజుల తర్వాత మే 23వ తేదీ 2019న ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లెక్కించిన ఓట్ల జాబితా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉందని చెప్పలేమని ఎడిఆర్ అంటోంది. ఉజ్జాయింపుగా తోచిన లెక్కల్ని ఎన్నికల సంఘం విడుదల చేసిందని, అదంతా పూర్తి స్థాయిలో నమ్మదగ్గ సమాచారం కాదని ఎడిఆర్ ఆరోపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈ విధమైన ఓట్ల గల్లంతు అభ్యర్థుల భవితవ్యాన్ని మార్చేసిందని ఎడిఆర్ చెబుతోంది.

Next Story